Tollywood Special Committee on Troubles in Flood Affected Areas :వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విపత్తు వేళ మానవత్వం చాటాలన్న ప్రభుత్వం పిలుపుతో మనసున్న మారాజులు కదలివస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయం కోసం తెలుగు చలన చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. అంతేకాకుండా ప్రత్యేక కమిటీని నియమించి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వారి అవసరం మేర సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో అధ్యక్షుడు భరత్ భూషణ్ సహా నిర్మాతలు సురేశ్ బాబు, దిల్ రాజు, దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, ఛాంబర్ సభ్యులు సమావేశం నిర్వహించి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలకు తమ మద్దతు ప్రకటించారు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలోని అగ్ర నటీనటులు, దర్శక నిర్మాతలు తమ వంతు సహాయంగా భారీ విరాళాలు ప్రకటించగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఫెడరేషన్ కూడా సహాయాన్ని ప్రకటించింది.
Actor Varun Tej Donates to Flood Relief Fund : ఫిల్మ్ ఛాంబర్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షలు, నిర్మాతల మండలి చెరో రూ.10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించగా నిర్మాతలు సురేశ్ బాబు తమ కుటుంబం తరఫున కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే మరో నిర్మాత దిల్ రాజు తమ నిర్మాణ సంస్థల తరపున ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు. ఫిల్మ్ ఫెడరేషన్‌లోని కార్మికులంతా శుక్రవారం సమావేశమై ఒక రోజు వేతనాన్ని వరద బాధితుల సహాయం కోసం ప్రకటించనున్నారు.
చిత్ర పరిశ్రమ ప్రజల ఆదరణతో ఎదిగిందని, వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కోసం ఎప్పుడు ముందుంటుందని దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు తెలిపారు. అంతకముందు వరద సహాయక చర్యలకు నటుడు వరుణ్‌తేజ్ రూ.15 లక్షల విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి చెరో రూ.5 లక్షలు విరాళంతో పాటు, ఏపీ పంచాయతీరాజ్ శాఖకు మరో రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు.
MP Mallu Ravi Donation for Floods Victims :ముఖ్యమంత్రి నిధికి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తన నెల జీతాన్ని విరాళం ఇచ్చారు. వర్షాలు, వరదలతో విలవిలలాడుతున్న రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు చేదోడుగా తన నెల జీతం రూ.లక్షా 90వేల మొత్తాన్ని విరాళం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతా పేరున ఆయన చెక్ ప్రభుత్వానికి అందించినట్లు వివరించారు.