Variety Ganesh Idols In Warangal : విఘ్నాలు తొలగించే వినాయకుడి పండుగ వచ్చిందంటే చాలు రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ గణనాథుల మండపాల ఏర్పాట్లలో నిమగ్నమైపోతారు. ఇందులో భాగంగా వరంగల్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఓ వైపు పర్యావరణానికి ప్రాధాన్యమిస్తూనే మరోవైపు సందేశాత్మకంగా పలు ఆకృతులలో ఏకదంతుడ్ని ఏర్పాటు చేసి పూజిస్తున్నారు.
మర్రిఊడలు, వేపచెట్టు బెరడుతో వినాయకుడు :పర్యావరణం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా వరంగల్‌కు చెందిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు నడుబిగించారు. గతానికి భిన్నంగా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నారు. వరంగల్ నగరంలోని కొండురు వీధికి చెందిన కాకతీయ గజానన మండలి సభ్యులు పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంలో మర్రి ఊడలు, వేప చెట్టు బెరడుతో ఏర్పాటు చేసిన ఏకదంతుడిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.
గత ఐదేళ్లుగా మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నామని నిర్వహకులు తెలిపారు. రామన్నపేటకు చెందిన ఉత్సవ సమితి సభ్యులు ఏకంగా పోకచెక్కలతో వినాయకున్ని ఏర్పాటు చేశారు. ఇందుకు గాను 12 కిలోల నలుపు రంగు వక్కలను 4 కిలోల తెలుపు రంగువి ఉపయోగించారు. బెంగాలీ కళాకారులు 15 రోజుల పాటు శ్రమించి విగ్రహం తయారు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు.