Vaikunta Ekadashi Celebrations In Andhra Pradesh:వైకుంఠ ఏకాదశి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శన భాగ్యం కలిగింది. తిరుమలలో స్వామివారికి కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా వేడుకలు: ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరద్వార దర్శనం కోసం వేకువజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులుతీరారు. తిరుమలలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున స్వామివారికి శాస్త్రోక్తంగా పూజ కైంకర్యాలతోపాటు అభిషేకం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సామాన్యులతోపాటు ప్రముఖులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
శోభాయమానంగా వెలిగిపోతున్న వైష్ణవాలయాలు - మిన్నంటిన ముక్కోటి ఏకాదశి వైభవం
విజయవాడలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని పట్టణాలు, గ్రామాల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ద్వారకా తిరుమల దత్తత దేవాలయంలో వెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వార దర్శనంలో కొలువు తీర్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలోని అమ్మవారిని భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
సత్తెనపల్లిలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ లబ్బీపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. రాజధాని ప్రాంతం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి భక్తులు వైకుంఠనాధుడిని దర్శించుకున్నారు.
అన్నవరం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీ మహా విష్ణువు, మహాలక్ష్మి అలంకరణలో స్వామివార్లు భక్తులకు దర్శనమిచ్చారు. కోనసీమ జిల్లావ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. అమలాపురం, అయినవిల్లి, అప్పనపల్లి, వాడపల్లి, అంతర్వేది, అంబాజీపేటలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రధాన రహదారిలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
అనంతపురంలో పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీకంఠం వెంకటేశ్వర స్వామి ఆలయం, హౌసింగ్ బోర్డ్ వెంకటేశ్వర స్వామి ఆలయాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో ఊరేగించారు. భక్తులు వేకువజాము నుంచే స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పరవశించిపోయారు.
వైకుంఠ ప్రాప్తిని కలిగించే ముక్కోటి ఏకాదశి- ఈ నియమాలు పాటిస్తే మోక్షం ఖాయం!
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తజనం