Talaricheruvu Aggipadu Tradition : శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణమిది. కానీ ఈ రోజుల్లోనూ తమ గ్రామాన్ని ఓ శాపం వెంటాడుతోందని ఆ గ్రామస్థులు నమ్ముతారు. ఈ క్రమంలోనే ఊరిని ఖాళీ చేసి అర్ధరాత్రి దాటాక తిరిగి ఇంటికొస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ అగ్గిపాడు ఆచారాన్ని తరాలుగా పాటిస్తున్నారు. ఇంతకీ ఏంటీ ఈ ఆచారం? ఎందుకు పాటిస్తున్నారు? దీని వెనుక అసలు కథేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. మాఘమాసంలో పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆ ఇంట్లో పొయ్యి వెలగదు, దీపం ముట్టించరు. ఆ రోజు ఊరు మొత్తం ఖాళీ చేస్తారు. తమతో పాటు పెంచుకుంటున్న ఆవులు, గేదెలు, గొర్రెలు, కోళ్లను వెంట బెట్టుకొని ఊరి చివరికి వెళ్తారు. అక్కడ హాజీవలి దర్గావద్దకు వంటావార్పు చేసుకుంటారు. పౌర్ణమి ఘడియలు ముగిసేవరకు ఊళ్లోకి రారు.
Talaricheruvu Strange Culture : 500 ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని గ్రామస్థులు బుధవారం పౌర్ణమి రోజున కొనసాగించారు. అక్కడే వంటలు చేసుకుని సంతోషంగా గడిపారు. అర్ధరాత్రి తర్వాత పౌర్ణమి ఘడియలు దాటాక, అందరూ తిరిగి ఒక్కొక్కరుగా గ్రామానికి చేరుకున్నారు. అప్పుడు మళ్లీ గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, దీపాలు వేసి ఇల్లంతా శుద్ధి చేసుకుని, తలస్నానాలు చేసి దేవునికి పూజలు చేశారు.
శతాబ్దాల క్రితం జరిగిన బ్రాహ్మణ హత్య శాపంగా మారి గ్రామాన్ని వెంటాడుతోందని ఇప్పటికీ ఈ గ్రామస్థులు నమ్ముతారు. ఇందుకు సంబంధించి ఓ కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. పూర్వం 500 సంవత్సరాల క్రితం బందిపోట్లతో కలిసి ఓ బ్రాహ్మణుడు ఊరిలో పండిన పంటను, ధనాన్ని దోచుకెళ్తుండేవాడు. గ్రామస్థులంతా కలిసి అతణ్ని చంపివేశారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో పుట్టిన మగ శిశువులు మరణించడమే కాకుండా ఊరంతా కరవుకాటకాలతో అల్లాతుండేది.
దీనిపై గ్రామస్థులు అప్పట్లో ఓ మునిని అడగగా బ్రాహ్మణ హత్య కారణంగానే గ్రామంలో మగపిల్లలు బతకడంలేదని, ఊరు అభివృద్ధి చెందడం లేదని వారికి తెలిపారు. దీనికి ప్రాయశ్చిత్తంగా మాఘశుద్ధ పౌర్ణమి ఊళ్లో నిప్పు రాజేయకుండా ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని సూచించారు. అలా చేయడంతో గ్రామానికి మంచి జరిగిందని నానుడి. ఈ ఆచారాన్ని చూసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చాలామంది అక్కడికి వస్తుంటారు. మరికొందరు ఆసక్తిగా దీన్ని గురించి తెలుసుకుంటారు. దీనిని పాటిస్తున్నందునే అందరం సంతోషంగా ఉన్నామని తలారిచెరువు గ్రామస్థులు నేటికీ నమ్ముతారు.
ఆ ఊరంతా వలస వెళ్లే వింత ఆచారం - గుడికొత్తూరు కథేంటి? - Entire Village Migrated