Bail For Vijay Paul in Raghu Rama Krishna Raju Case : శాసనసభ ఉపసభాపతి, నాటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి కేసులో బుధవారం గుంటూరు న్యాయస్థానంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. రఘురామకృష్ణరాజు నుంచి న్యాయమూర్తి వాంగూల్మం నమోదు చేయగా దాడి ఘటనలో కీలకపాత్ర పోషించిన విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. మరో నిందితుడు కామేపల్లి తులసిబాబును 24 గంటల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మరో న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ కేసులో సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం గుంటూరు న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఆయన 78 రోజులుగా జైలులో ఉన్నారని, కస్టడీలో పూర్తిగా విచారించారని, బెయిల్ మంజూరు చేయాలని విజయ్‌పాల్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. వాదనల అనంతరం విజయ్‌పాల్‌కు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజా ఉత్తర్వులిచ్చారు. షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోరుతూ కేసు విచారణాధికారి కోర్టును ఆశ్రయించవచ్చని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- గుంటూరు ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.లత తన కార్యాలయంలో శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వాంగ్మూలం నమోదు చేశారు. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7గంటల వరకూ ఈ ప్రక్రియ సాగింది.
- ఆరో నిందితుడు కామేపల్లి తులసిబాబును మరోసారి పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి జి.స్రవంతి ఉత్తర్వులిచ్చారు.
- అప్పట్లో సీఐడీ విభాగాధిపతిగా ఉన్న పీవీ సునీల్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయన సూచనల మేరకు కస్టడీలో ఉన్న రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విచారణకు ఆయన సహకరించడం లేదని, మరో మూడు రోజులు కస్టడీకివ్వాలని కోర్టులో పోలీసులు అభ్యర్థించగా గురువారం ఉదయం 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
మరోసారి కస్టడీకి విజయ్‌పాల్ - 27 కార్లతో విచారణకు తులసిబాబు
'కస్టోడియల్ టార్చర్ కేసులో సొంతంగా సమాంతర దర్యాప్తు జరుపుతున్నాం. నిందితులు ఎవరిని వదిలిపెట్టేది లేదు. బెయిల్ వచ్చిన విజయ్ పాల్ ఈ కేసులో ప్రధాన సూత్రధారి. జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి రాజకీయ ప్రలోభాలకు లొంగిపోయారు, రానున్న రోజుల్లో మరికొంతమంది విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.' -రఘురామకృష్ణరాజు, ఉపసభాపతి
గుంటూరు న్యాయస్థానం వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేసులో కీలకమైన సీఐడీ నాటి విభాగాధిపతి సునీల్‌కుమార్‌పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదో తనకు తెలియదని చెప్పారు. తులసిబాబుకు న్యాయవాది పట్టా లేకుండానే ప్రభుత్వ సొమ్ము రూ.48 లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేయాలని ఏసీబీకి లేఖ రాస్తానన్నారు. మరో నిందితురాలు డాక్టర్ ప్రభావతి కూడా కుట్రలో పాలుపంచుకున్నారని రఘురామకృష్ణరాజు చెప్పారు. వాంగూల్మం ఇచ్చి కారు ఎక్కిన ఆయన అక్కడే ఉన్న డాక్టర్ ప్రభావతి భర్త రవికుమార్‌ను పలకరించారు.
'గాయాలు లేవని ఎలా నిర్ధారించారు?' - ప్రభావతిని ప్రశ్నించిన ఒంగోలు ఎస్పీ