Plum Cake Making with Alcohal : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్, అల్వాల్ పరిధిలోని పలు బేకరీ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సికింద్రాబాద్ ఖార్ఖానాలోని వ్యాక్స్ ప్యాట్రీస్ బేకరిలో ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి లేకుండా ప్లమ్ కేక్‌లను తయారు చేయడానికి ఆల్కహాల్ (రమ్) ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
కిచెన్ అపరిశుభ్రం : అంతే కాకుండా కేక్ తయారీలో ఉపయోగించే పాత్రలు వంటగది మొత్తం అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ నిబంధనలు ఉల్లంగించినట్లు తెలిపారు. కెమికల్స్, నాన్ వెజ్ ఫుడ్ ఆర్టికల్స్ వంటి వస్తువులతో పాటు ఇతర సామాగ్రి అన్ని ఒకే చోట ఉన్నట్లు గుర్తించారు.