Urban Forestry Scheme : ప్రస్తుతం ప్రపంచం ఉరుకుల పరుగుల జీవితంలో జీవిస్తోంది. దీంతో చిన్న ఆనందాలను, ప్రకృతితో మమేకమయ్యే పరిస్థితిని ప్రజలు కోల్పోతున్నారు. కాంక్రీటులోనే జీవితాన్ని గడిపేస్తూ కాలుష్యంలో చిక్కుకుంటున్నారు. ఉదయం లేస్తే చాలు పని అంటూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లిపోవడం, ఆ తర్వాత ఇంటికి వచ్చి 4 గోడల మధ్యనే జీవిస్తున్నారు. దీంతో బయటి ప్రపంచంతో సంబంధం అనేది లేకుండా పోయి, జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలాంటి వారి కోసం చర్యలకు దిగి ఓ పథకాన్ని ప్రారంభించింది.
కనీసం సెలవు రోజుల్లోనైనా కాలుష్యానికి దూరంగా ప్రశాంతంగా గడిపేలా నగర వన యోజన పథకం తీసుకొచ్చింది. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం పరిధి అక్కన్నపేట అటవీ ప్రాంతంలో పార్కును అభివృద్ధి చేయనున్నారు. రామాయంపేట పురపాలికకు సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద రూ.2 కోట్లతో అర్బన్ పార్కు నిర్మాణాన్ని చేపడుతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కాగా, అక్కన్నపేట బీట్ పరిధిలో సుమారు 550 హెక్టార్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 50 హెక్టార్ల పరిధిలో పార్కును నిర్మించి తాత్కాలిక రుసుంతో నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో కాంక్రీట్ జీవితం నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.