యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు తేజాలు UPSC Civils Results 2024 : యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్యరెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లో చదివిన అనన్య రెడ్డి, ఇంటర్ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. దిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె, ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు.
UPSC Topper Ananya Reddy :ఎంతో కఠినమైన సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది తొలి ప్రయత్నంలోనే కోచింగ్ కూడా తీసుకోకుండా దాదాపు సొంత ప్రిపరేషన్‌తోనే సివిల్స్‌లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో భళా అనిపించారు అనన్య రెడ్డి. ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్‌కు ఎంపిక అవుతానని భావించినప్పటికీ, మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని ఆమె చెప్పారు. తమ కుమార్తె మూడో ర్యాంకు సాధించటం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా క్యాప్ జెమినీలో ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్ అయిన కౌశిక్, తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. ఓయూలో సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన దిల్లీలో ఎంబీఏ చేశారు. అందరూ చదివినట్లే చదివానని, రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటల పాటు ప్రిపేర్ అయినట్లు ఆయన ‘ఈటీవీ’తో చెప్పారు.
కాళ్లు, చేయి లేకున్నా సివిల్స్‌లో విజయం.. దివ్యాంగుల అద్భుత ప్రతిభ
యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు వెయ్యిలోపు ర్యాంకులను సాధించారు. హనుమకొండ జిల్లాకు చెందిన జై సింహారెడ్డి 104 ర్యాంక్ సాధించగా, వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన కిరణ్ 568 ర్యాంక్ సాధించారు. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన ప్రణయ్ 554 ర్యాంకును సొంతం చేసుకోగా, వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన అనిల్ 764 కైవసం చేసుకున్నారు.
Hanitha got 887 Rank in Civils : విధి వంచించినా విశ్వాసం ఆమెను నిలబెట్టింది. కాళ్లు కదలకపోయినా, పట్టువిడవని సంకల్పం తనను ముందుకు నడిపింది. ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా కదల్లేని స్థితిలో కళాశాలకు దూరమైనా, చదువును మాత్రం ఏనాడు దూరం చేసుకోలేదు. దూరవిద్య ద్వారా చదువులు పూర్తిచేసి, కుటుంబం, గురువుల సహకారంతో దేశంలోనే అత్యున్నత కొలువులకు ఎంపికయ్యారు. విశాఖపట్నానికి చెందిన హనిత. తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 887 ర్యాంకు సాధించి, ఆమె అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సమాజంలో అందరికీ విద్య అందించటమే లక్ష్యం అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల సివిల్స్ విజేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 50 మందికి పైగా ఎంపికవటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మూడో ర్యాంకు సాధించిన దోనూరి అనన్యరెడ్డి అభినందించిన ఆయన, పాలమూరు బిడ్డ మూడోర్యాంకు సాధించడం హర్షణీయమన్నారు.
ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు, అపజయాలను అధిగమించిన సివిల్స్ సర్వీస్‌కు ఎంపికైన యువతి