Universities Action Against Engineering Colleges Flouting Rules :రాష్ట్రంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్న పలు ఇంజినీరింగ్, ఇతర కళాశాలలపై విశ్వవిద్యాలయాలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఏదైనా సమస్య వెలుగుచూసినప్పుడు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ప్రాబ్లమ్ సద్దుమణిగాక యాజమాన్యాలతో రాజీపడుతున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎన్నోసార్లు కాలేజీల అక్రమాలు బయటపడినా అఫిలియేషన్ రద్దు చేసిన దాఖలాలు గత పదేళ్లలో లేవు. ఈ నేపథ్యంలో విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత కొద్ది నెలలుగా విద్యార్థుల్లో నైపుణ్య లేమి గురించి పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. నాసిరకం కళాశాలల అనుమతులు రద్దు చేస్తామని ఘాటుగా హెచ్చరించారు.
హైదరాబాద్ నల్లకుంటలోని హిందీ మహావిద్యాలయ కాలేజీ విద్యార్థులు కొందరు తప్పినా, పాసైనట్లు ఓయూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి దస్త్రాలు తారుమారు చేశారని తేలడంతో తాజాగా ఆ కళాశాల అనుబంధ గుర్తింపును ఓయూ రద్దు చేసింది. అటానమస్ హోదాను కూడా రద్దు చేయాలని యూజీసీకి లేఖ రాయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఓయూ పరిధిలో సుమారు 40 వరకు యూజీసీ అటానమీ గుర్తింపు ఉన్న కళాశాలలున్నాయి. వాటితోపాటు ఇతర కళాశాలల మేనేజ్మెంట్స్ తాజా చర్యతో వణికిపోతున్నాయి.
అనుబంధ గుర్తింపు పొందటం అనుకున్నంత సులువు కాదు : జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ విధివిధానాల్లో పారదర్శకత లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. ఈసారి గతంలో మాదిరిగా అనుబంధ గుర్తింపు పొందటం అనుకున్నంత సులువు కాదని, తేడా వస్తే అనుమతి కూడా దక్కకపోవచ్చని అంతా భావిస్తున్నారు. నిజ నిర్ధారణ బృందాల (ఎఫ్‌ఎఫ్‌సీ) తనిఖీ రిపోర్టులను సైతం వెబ్‌సైట్లో పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.