Kingfisher Beers Supply stoped in Telangana :తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు షాక్ తగిలింది. ఎందుకంటే తెలంగాణకు బీర్ల సరఫరా యునైటెడ్ బ్రూవరీస్ నిలిపివేసింది. దీంతో రాష్ట్రానికి ఏడు రకాలైన బీర్ల సరఫరా నిలిచిపోనుంది. గత ఐదేళ్లుగా ధరలు పెంచలేదని, అందువల్లే సరఫరా నిలిపివేస్తున్నట్లు యూనైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గత 2019 నుంచి ఇప్పటి వరకు బీర్ల ధరలు పెంచలేదని ఆందోళన వ్యక్తం చేసింది.
కింగ్ ఫిషర్ వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం : తెలంగాణలో వినియోగిస్తున్న బీర్ల పరిమాణంలో 88 శాతం యునైటెడ్ బేవరిస్ సరఫరా చేస్తున్న కింగ్ ఫిషర్ బ్రాండ్ ఉన్నట్లు పేర్కొంది. ప్రతి సంవత్సరం తమ బీర్ల సరఫరా ద్వారా రూ. 4500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్నట్లు వివరించింది. ఉన్నపళంగా యూనైటెడ్ బీర్లు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌కు సమాచారం అందించడంతో దీనిపై ప్రభుత్వం ఆరా తీసింది. రాష్ట్రంలో 80 శాతానికి పైగా మార్కెట్ ఉన్న కింగ్ ఫిషర్ బీర్లు ఆగిపోవడంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ నష్టాల వల్లే :పెరిగిన ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా ధరలు పెంచకపోవడం వల్ల సంస్థకు భారీగా నష్టాలు వస్తున్నాయని యూబీఎల్ పేర్కొంది. అందువల్ల సరఫరా నిలిపివేశామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని యునైటెడ్ బ్రూవరీస్ సెబీకి పంపిన లేఖలో స్పష్టం చేసింది. మరీ దీనిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కింగ్‌ఫిషర్ ప్రియులు ఈ నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు.