Union Minister Ram Mohan Naidu political Career: పులి కడుపున పులే పుడుతుందనే నానుడిని నిజం చేస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొద్ది రోజుల్లోనే ఆ యువనేత సిక్కోలు సింహంలా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్‌లో గళం వినిపించగా ప్రత్యర్థులూ ఆయన వాగ్థాటికి ముగ్ధులయ్యారు. అనేక సమస్యలపై గొంతెత్తగా నేటికీ సోషల్ మీడియాలో ఆ వీడియోలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నిబద్ధత, అంకితభావం మెండుగా ఉన్న ఆ యువకుడే ఇప్పుడు మోదీ కేబినెట్‌లో చోటు సంపాదించారు. ఆయనే వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. కేంద్రమంత్రి పదవి దక్కించుకున్న వేళ ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం.
రాష్ట్రం నుంచి మరొకరికి కేంద్రమంత్రి వర్గంలో చోటు! - Narasapuram MP Srinivas varma
ఘనమైన రాజకీయ ప్రస్థానం విభిన్న భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యం. సమస్యలపై చట్టసభలో గళమెత్తి పోరాడే పటిమ. ఇన్ని లక్షణాలున్నాయి కాబట్టే ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మోదీ ప్రభుత్వంలో మంత్రిగా చోటు సంపాదించారు. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మాజీమంత్రి, దివంగత తెలుగుదేశం అగ్రనేత ఎర్రన్నాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్‌కు మంత్రి పదవి దక్కింది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల ప్రావీణ్యంతో పార్లమెంట్ చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడంతో రామ్మోహన్ నాయుడికి కేంద్ర క్యాబినెట్ పదవి వరించింది.