Union Minister Kishan Reddy Visits Medaram Jatara : జాతీయ పండగ విషయంలో కొంతమంది తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ పండగ అనే వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. దేశంలో ఏ పండగను కూడా జాతీయ పండుగగా ప్రకటించలేదన్నారు. మేడారంలో సమక్క - సారలమ్మ లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అంతకు ముందు తులాభారం సమర్పించారు. ఆ తర్వాత మేడారంలో మీడియా సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం తరపున మేడారం మౌలిక వసతుల కోసం ఆర్థికంగా నిధులు సమకూర్చాం అన్నారు. సమ్మక్క - సారలమ్మ జాతరకు కేంద్ర ప్రభుత్వం తరపున రూ 3.14 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి సమ్మక్క - సారక్క జాతర జరుగుతుందని, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వస్తుంటారన్నారు.
'బండెనక బండి కట్టి - పదహారు బండ్లు కట్టి' - ఊరుఊరంతా మేడారం జాతరకు
గిరిజన యూనివర్సిటీనీ ఈ ఏడాది నుంచి అమ్మవార్ల పేర్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయన్నారు. రూ.900 కోట్లతో సమ్మక్క- సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతుందన్నారు. ఇప్పటికే యూనివర్సిటీ ఏర్పాటు కోసం 337ఎకరాల భూసేకరణ జరిగిందని మరికొంత జరుగుతుందన్నారు. ఈ సంవత్సరమే అడ్మిషన్లు జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారన్నారు. సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. వర్సిటీ నిర్వహణ కోసం తాత్కాలిక భవనం ఏర్పాటు చేస్తామని, మెజారిటీ సీట్లు గిరిజన బిడ్డలకే ఉంటాయని స్పష్టం చేశారు.