Bibinagar AIIMS Extension in Telangana :ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రగనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ నగరంలో ఒక అర్బన్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కేంద్రం ద్వారా వైద్య విద్యార్థులకు అవసరమైన బోధన శిక్షణ కార్యక్రమాలను, నగరంలో నివసిస్తున్న ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ఉంటుందని లేఖలో ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు : ఎయిమ్స్ బీబీనగర్ ఎక్స్‌టెన్షన్ కోసం హైదరాబాద్ నగరంలో తాత్కాలికంగా ఒక ప్రభుత్వ భవనాన్ని కేటాయించినట్లయితే, అక్కడ ఎయిమ్స్ బీబీనగర్‌కు అనుబంధంగా అర్బన్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేసి, నగరంలో నివసిస్తున్న ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు.
శాశ్వతభవనంకు లేఖ : అలాగే నగరం నడిబొడ్డున 2 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించినట్లయితే అర్బన్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌కు శాశ్వత భవనాన్ని నిర్మాణం చేయడానికి ఎయిమ్స్ బీబీనగర్ సిద్ధంగా ఉందన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ 26.07.2024 న డిప్యూటీ డైరెక్టర్, ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ విషయంపై సీఎం ప్రత్యేకమైన దృష్టిసారించాలని కోరారు.