Kishan Reddy On Musi Victims Houses Demolitions : మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరూ ధనవంతులు లేరని పేద ప్రజల ఇళ్లను కూల్చే ముందు వాళ్లతో చర్చించి ఒప్పించిన తర్వాతే ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అంతా మూసీలోనే కలుస్తోందని దానికి ప్రత్యామ్నయం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
మూసీ సుందరీకరణ కోసం రూ.లక్షా యాభై వేల కోట్ల ఖర్చు అవుతుందన్న ప్రభుత్వం ఆ నిధులను ఎక్కడి నుంచి సమీకరిస్తుందో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు వెలిశాయని 40ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్లకు ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించాలని కిషన్ రెడ్డి అన్నారు.
బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు :మరోవైపు కూల్చివేతల విషయంలో హైడ్రా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తే బ్యాంకు రుణాలు ఎవరు చెల్లిస్తారని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు వార్తలను ఆయన ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.