Union Minister Bandi Sanjay Respond To Govt Letter Over Liberation Day :తెలంగాణ ప్రజాపాలన దేనికోసం, ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడం లేదని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని, నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదన్నారు.
కాంగ్రెస్కు చేతనైతే తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా తానే హాజరవుతా అన్నారు. వారికి చేతకాకుంటే కేంద్రం పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
నిన్నటివరకూ హైడ్రా - నేడేమో విగ్రహాల పేరిట కొత్త నాటకానికి తెర :సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కాంగ్రెస్ రాజకీయ డ్రామాలకు నిదర్శనమని ఆరోపించారు. దమ్ముంటే ఆరు గ్యారంటీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని లోపాయికారీ ఒప్పందాలతోనే కాలం వెల్లదీస్తున్నాయని ఆరోపించారు. కావాలనే హైడ్రా, విగ్రహాల పేరిట రోజుకో లొల్లి పెట్టుకొని, ఆరు గ్యారంటీలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంపై ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఖాళీగానే ఉంది కదా, ఆయన కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆ పదవి ఇస్తారేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కాం కేసులో ఇరు కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఉందని ఎద్దేవా చేశారు.
"రెండూ పార్టీలు కలిసి రాష్ట్రంలో డ్రామాలకు తెరలేపాయి. ఎందుకంటే వీళ్ల ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్లు చేతుల్లో ఉంది, వీళ్ల ఓటుకు నోటు కేసు వారి దగ్గర ఉంది. అందుకని ఇరువురు ఏకమై, ఒప్పందంతో ముందుకు వెళ్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆరు గ్యారంటీలను పక్కదోవ పట్టిస్తూ హైడ్రా, విగ్రహాల లొల్లిలు తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపించాలి."-బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి