Food Inspections In Hyderabad Hotels :హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, స్వీట్ దుకాణాల్లో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలను కొనసాగిస్తోంది. గత మూడ్రోజుల్లో గుర్తించిన లోపాలను అధికారులు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. చైతన్యపురి, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లోని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, బేకరీలు, మండీ హౌజ్‌లు, షవర్మా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టగా, అతి దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. తినడానికి ఏమాత్రం పనికి రాని మాంసం, కూరగాయలు, క్యాన్సర్ కారకాలైన రంగులతో పాటు గ్రీజులా మారిన వంట నూనె, ఇతరత్రా లోపాలను గుర్తించారు.
యూసఫ్‌గూడ హెటళ్లలో టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో వెలుగుచూసినవి
- ఏజీ కాలనీలోని మహమ్మదీయ షవర్మా కేంద్రంలో గ్రీజులా మారిన పలుమార్లు ఉపయోగించిన నూనె, షవర్మా తయారీలో తుప్పు పట్టిన పాత్రలు ఉపయోగించడం, ఫ్రిడ్జిలో కుళ్లిన ఆహార పదార్థాలు, ఫుడ్ లైసెన్సు లేకపోవడం తదితర లోపాలు గుర్తింపు.
- రాజీవ్‌నగర్‌లోని అల్ ఖాసీం ది మండీ హౌజ్‌లో అపరిశుభ్రంగా ఉన్న వంట గదిలో నేలపైనే వంట సామగ్రిని ఉంచడం, ఫ్రిడ్జ్‌లో మురుగువంటి నీరు, జిడ్డుగా మారిన పైకప్పు, ఎక్జాస్ట్ ఫ్యాన్, పొయ్యి తదితరాలు.
- అల్ మతమ్ మదీనా మండీలో ఇరుకు గదిలో పరిశుభ్రంగా లేని వంట రూం, సింథటిక్ కలర్స్‌ను ఉపయోగించడం, నేలపై చెత్త, ఇతరత్రా ఉండటం.
- అల్ మతమ్ అల్ హింద్ అరేబియన్ మండీలో అపరిశుభ్ర వంట గది, చిమ్ని, వ్యర్థాలు, బొద్దింకలును గుర్తించారు.
అమీర్‌పేటలో
- వాసిరెడ్డి హోమ్ ఫుడ్స్‌లో ( దీనికి లైసెన్సు లేదు) వంట మనుషుల వస్త్రధారణ సరిగా లేకపోవడం, బొద్దింకలు, తయారీదారుల వివరాల్లేని ‘రెడీ టూ ఈట్’ ఆహార పదార్థాల విక్రయం.
- వినూత్న ఫుడ్స్ (లైసెన్సు లేదు) లేబుల్స్ లేకుండా ఫుడ్ ఐటమ్స్ అమ్మకం, అపరిశుభ్రత
- ఆగ్రాస్వీట్స్‌లో (లైసెన్సు లేదు) గడువు ముగిసిన చుడవ, బేల్, ఇతర పదార్థాలు అమ్మకం.
- దిల్లీ మిఠాయివాలాలో బొద్దింకలు, ఎలుకలు, తెరచి ఉంచిన చెత్త డబ్బాలు, సరిగా భద్రపరచని సరకులు.