Underground Metro In Airport Corridor Hyderabad:శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం, పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతోంది. ఇప్పటివరకు రాజధాని నగరంలో మెట్రో తొలి దశలో నిర్మించినవన్నీ ఆకాశ(ఎలివేటెడ్) మార్గాలే. ఎయిర్‌పోర్టు కారిడార్‌లో ఆకాశమార్గంతో పాటు మొదటిసారిగా భూమిపై కొంత, భూగర్భంలో మరికొంత దూరం నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)లో పొందుపర్చారు.
నాగోల్ నుంచి 33.1 కి.మీ. విస్తరణ :రాయదుర్గం నుంచి నాగోల్ వరకు ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు మార్గాన్ని ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి, పీ7 రోడ్, శంషాబాద్ విమానాశ్రయం వరకు 33.1 కి.మీ. మేరకు విస్తరించేలా రెండో దశలో ప్రతిపాదించారు. ఇందులో నాగోల్ నుంచి లక్ష్మీగూడ వరకు 21.4 కి.మీ. ఎలివేటెడ్ ( ఆకాశమార్గం) ఉంటుంది. లక్ష్మీగూడ నుంచి పీ7 రోడ్డు ఎయిర్‌పోర్టు ప్రాంగణం సరిహద్దు వరకు 5.28 కి.మీ. ఎట్ గ్రేడ్ (భూమార్గాన్ని) ప్రతిపాదించారు.
ఇక్కడ రహదారిపై డివైడర్ స్థలం చాలా విశాలంగా ఉంటుంది. నిర్మాణ వ్యయం తగ్గేందుకు భూమార్గంలో మెట్రో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో సూచించారు. బేసిక్ స్టడీ చేశాక స్వల్పదూరం భూమార్గంలో తీసుకెళ్లేలా డీపీఆర్‌లో ప్రతిపాదించారు. విమానాశ్రయ ప్రాంగణ సరిహద్దు నుంచి టెర్మినల్ వరకు 6.42 కి.మీ. అండర్ గ్రౌండ్లో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మార్గం కానుంది. ఇక్కడ మూడు స్టేషన్లు - కార్గో, టెర్మినల్, ఏరోసిటీ రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ డిపో నిర్మించాలనీ ప్రతిపాదించారు.
పట్టాలపైకి విశాఖ మెట్రో- సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక - VISAKHA METRO