Unauthorized Use Of Electricity In Serilingampally : మూడు పడక గదుల(ట్రిపుల్ బెడ్రూం) ఇంటికి నెలకు రూ.72 వ్యాపార సముదాయానికి రూ.200 కరెంట్ బిల్లు. అన్ని అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయాలుండే ప్రాంతంలో ఇంత తక్కువ బిల్లు వస్తుందంటే ఎవరికైనా సందేహం కలగవచ్చు. శేరిలింగంపల్లి తారానగర్ సెక్షన్ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులకు అనుమానం రాలేదు. నివాసితులు విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేయడంతో వారి పరిశీలనలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మూడు పడక గదుల ఇంటికి రూ.72 కరెంట్ బిల్ :లింగంపల్లి, హుడా ట్రేడ్ సెంటర్‌లోని గాంధీ ఎస్టేట్ డీ బ్లాక్‌లో తరచూ విద్యుత్తు సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై వారు కారణాలను అన్వేషించగా కొందరు అక్రమంగా విద్యుత్తు వాడుతున్నట్లు గుర్తించారు. విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో 2 రోజుల క్రితం వారు దాడులు నిర్వహించారు. వారి పరిశీలనలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. నెలలుగా ఓ మూడు పడక గదుల ఇంటికి అతి తక్కువ కరెంట్ బిల్లు, కొన్నిసార్లు రూ.72 మాత్రమే వచ్చినట్లుగా తేలింది.