Two Schools Run in One Room at Mancherial : ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయుల కొరత, అవసరం లేని చోట ఉపాధ్యాయుల బదిలీల వార్తలు తరచూ వింటున్నాం. అయితే, ఇక్కడ మాత్రం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నా అందుకు తగ్గట్టుగా తరగతి గదులు లేవు. దీంతో రెండు స్కూల్స్‌కు చెందిన విద్యార్థులకు ఒకే పాఠశాలలో తరగతులు బోధిస్తున్నారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
ఒక గదిలో రెండు తరగతులు నిర్వహించడం అక్కడక్కడ జరుగుతుంటుంది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్ అనుబంధ గ్రామం గట్టుపల్లిలో మాత్రం ఒకే గదిలో ఏకంగా రెండు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. కేస్లాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. అక్కడి విద్యార్థులను అదే పంచాయతీలోని గట్టుపల్లి పాఠశాలకు తరలించారు. ఇక్కడ ఒక గది, వరండా మాత్రమే ఉన్నాయి.
ఇక్కడేమో 100 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు - అక్కడ విద్యార్థులు లేకున్నా టీచర్ కేటాయింపు - Govt school students in Telangana
ప్రస్తుతం ఒకే ఇరుకు గదిలో రెండు పాఠశాలలకు చెందిన 70 మంది విద్యార్థులకు బోధిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు పాఠశాలలకు సంబంధించి ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులందరినీ కలిపే పాఠాలు చెబుతున్నారు. రెండు పాఠశాలల్లోని నలుగురు ఉపాధ్యాయులకు గాను ఒకరు డిప్యుటేషన్‌పై వెళ్లగా ముగ్గురు ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కేస్లాపూర్ పాఠశాలకు మన ఊరు-మన బడి కింద రూ.12 లక్షల నిధులు మంజూరయ్యాయి. గట్టుపల్లి పాఠశాల భవనం పక్కనే గుత్తేదారు పనులు ప్రారంభించి పిల్లర్లు నిర్మించారు. బిల్లులు రాకపోయే సరికి మధ్యలోనే నిలిపివేశారు.
ఈ విషయంపై ఎంఈవో మహేశ్వర్‌రెడ్డిని ' ఈటీవీ భారత్ ' వివరణ కోరగా, పాత భవనం కూలగొట్టిన చోటే కొత్త భవనం నిర్మిస్తే ఇబ్బంది ఉండేది కాదన్నారు. గట్టుపల్లిలో నిర్మాణం చేపట్టడంతో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు. ఆ భవన ఫొటో ఆన్‌లైన్‌లో నమోదుకాకపోవడంతో గుత్తేదారుకు డబ్బులు రావడం లేదని చెప్పారు. రెండు పాఠశాలలు ఒకే చోట నిర్వహించడం ఇబ్బందిగా తయారైందని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల చదువుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి పాఠశాల భవనం కోసం కేటాయించిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'ఏడు తరగతులు - ఓకే టీచర్' కథనానికి స్పందన - మళ్లీ ఆ ముగ్గురు టీచర్లకు డిప్యూటేషన్ - GOVT REPSONSE TO ETV BHARAT STORY