Road Accident in Nalgonda :నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేబుల్ వైర్లు తెగిపోవడంతో, టాటా కంపెనీకి చెందిన కార్మికులు రాత్రి నుంచి దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద కేబుల్ వైర్లకు మరమ్మతులు చేస్తున్నారు. తెల్లవారుజామున వారికి సంబంధించిన బోలెరో వాహనాన్ని రోడ్డు పక్కన పెట్టుకుని పనులు చేస్తున్నారు.
ఈ క్రమంలో గుంటూరు వైపు వెళ్లే డీసీఎం వాహనం అతి వేగంగా, రోడ్డు పక్కన ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. వేగంగా పల్టీ కొట్టి పని చేస్తున్న కార్మికుల పైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే పని చేస్తున్న యస్వీ (22), రిజ్వాన్ (36) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న వాడపల్లి పోలీసులు క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం : కర్ణాటక బస్సు వేగంగా లారీని వెనక నుంచి ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కర్ణాటక బస్సు సదాశివపేట మండలం మద్దికుంట వద్ద లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఘటన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. జరిగిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాను. ప్రమాదానికి బస్సు అతివేగమే కారణమని తెలుస్తోంది. గాయాలు అయిన వ్యక్తులను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.