11 Month Old Baby In Orphanage : మహబూబ్‌నగర్‌లోని శిశుగృహలో మంగళవారం మధ్యాహ్నం ఆసక్తి కర సంఘటన చోటుచేసుకుంది. శిశుగృహానికి ఓ పాపతో ఇద్దరు తల్లులు వచ్చారు. ఒక్కరు కన్నతల్లి కాగా, మరొకరు పెంచిన తల్లి. ఇద్దరు కలిసి తమ బిడ్డను శిశుగృహంలో వదిలి వెళ్లడానికి వచ్చారు. పేగుబంధం, పెంచిన బంధాన్ని వదులుకున్నారు. ఈ విషయం తెలియని 11 నెలల చిన్నారి గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ పాప ఏడ్పులు సైతం వారిని కదిలించలేకపోయాయి. ఇద్దరు తల్లులు ఉన్నా, ఎవ్వరు లేని అనాథగా మారి శిశు గృహానికి చేరిన ఓ చిన్నారి కథ.
మహబూబ్‌నగర్‌కు చెందిన రేణుక, లింగం దంపతులు రోజుకూలి చేస్తూ జీవనం సాగించేవారు. వాళ్లకు ఇద్దరు కుమార్తెలు. రేణుక మూడోసారి గర్భం దాల్చిన నాలుగు నెలలకే ఆమె భర్త లింగం అనారోగ్యంతో మృతి చెందారు. అసలే పేదరికం, ఆపై భర్త కూడా దూరమయ్యారు. బంధువుల సాయంతో ఎలాగోలా జీవించసాగింది. 11 నెలల కిందట మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో ఆమె పండంటి ఆడబిడ్డ జన్మించింది.
పేదరికం చేసిన పాపం!.. రూ.2.5 లక్షలకు 5రోజుల నవజాత శిశువు అమ్మకం
ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలో అర్థమవక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అప్పుడే, హన్వాడ మండలం కొత్తపేటకు చెందిన మణెమ్మ, చెన్నయ్య దంపతులు అదే ఆసుపత్రిలో తమ బంధువులను కలిసేందుకు వచ్చారు. రేణుక పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ దంపతుల హృదయం ద్రవించింది. వారికి సంతానం లేదు. దేవుడే తమకు కూతుర్ని ప్రసాదించాడేమోనంటూ ముద్దులొలికే బిడ్డను అక్కున చేర్చుకున్నారు. ఆ పాపకు జెస్సికా అని పేరు పెట్టుకున్నారు. చెన్నయ్య మేస్త్రీ పనిచేసేవాడు. ఇత తన కూతురుకు ప్రతినెలా పుట్టిన తేదీన కేక్ కోసి పండగలా చేసేవారు.
చెన్నయ్య నాలుగు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ అనూహ్య ఘటనతో జెస్సికాను చంకనెత్తుకుని మణెమ్మ, జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లోని తన పుట్టింటికి వచ్చింది. ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటోంది. ఆమె తల్లిదండ్రులేమో వృద్ధులు. పసిబిడ్డ పాలకు వారానికి రూ.600 అవుతోంది. దీంతో మణెమ్మ విధిలేని పరిస్థితిలో పాపను జడ్చర్ల పాతబజారులో ఉంటున్న సొంత తల్లి రేణుకకు అప్పగించేందుకు వచ్చింది.
ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను పోషించలేకపోతున్నానని, మూడో బిడ్డను కూడా సాకడం తన వల్ల కాదని రేణుక నిస్సహాయతను వ్యక్తం చేసింది. చివరికి, గుండె రాయి చేసుకున్న ఇద్దరు తల్లులు మహిళా శిశు సంక్షేమశాఖ అధికారుల శరణు కోరారు. తమ బిడ్డకు మూడుపూటలా పాలు తాగించండని వేడుకున్నారు. నిస్సహాయంగా తమ గుండెలో మరో భాగాన్ని అధికారులకు అప్పగించి అక్కడి నుంచి ఇద్దరు తల్లులు వెనుదిరిగారు.
డబ్బు కోసం కన్న కూతురినే అమ్మకానికి పెట్టిన తల్లి - స్ట్రింగ్ ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు - Parents who sold their daughter