Chinese Manja in Hyderabad : ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన చైనీస్ మాంజాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనీస్ మాంజాను స్థానికంగా తయారు చేయడం వల్లే మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్‌లో దొరికేది కొంతైతే, గుట్టుచప్పుడు కాకుండా స్థానికంగా తయారు చేసి ఈ-కామర్స్ సైట్స్‌లో అమ్మకాలు చేయడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయంపై త్వరలో ఈ-కామర్స్ సైట్స్ నిర్వహకులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కామర్స్ గోదాములపై కూడా దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.
అందరూ సహకరిస్తేనే అడ్డుకట్టు :పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చైనీస్ మాంజా వాడకాన్ని అరికట్టాలన్నారు. చైనీస్ మాంజా కారణంగా ఇప్పటికే నగరంలో పదికి పైగా కేసులు నమోదయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సీవీ ఆనంద్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ట్రాఫిక్ పోలీసుకు గాయాలు : రాష్ట్రంలో చైనా మాంజాతో ఇవాళ మరో ఇద్దరు ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్‌లో ట్రాఫిక్ పోలీసుగా పని చేస్తున్న శివరాజ్, నారాయణ గూడ ఫ్లైఓవర్ నుంచి తిలక్ నగర్ రోడ్డు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మాంజా దారం మెడకు చుట్టుకుని రక్తస్రావమైంది. చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.