Two Men assaulted women in Hyderabad :హైదరాబాద్ నగర్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ఆకతాయిలు యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. మణికొండ నెమలి నగర్ కాలనీలో కిరాణా దుకాణానికి వెళ్లిన విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. హోలీ పండుగ రోజు దొరకలేదంటూ సురేశ్ అనే యువకుడు విద్యార్థిని ఒంటిపై నీళ్లు పోశాడు. ఈ క్రమంలో యువతి అతడి నుంచి తప్పించుకొని ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా నిలదీయడానికి వెళ్లిన యువతి తల్లిదండ్రులపై సైతం కూరగాయల కత్తితో సురేశ్, అతని తమ్ముడు ప్రవీణ్ దాడి చేశారు.
సురేశ్ తమ్ముడు ప్రవీణ్ కత్తితో యువతి తండ్రి గొంతు కోశాడు. అడ్డువచ్చిన యువతి తల్లిపైన కూడా కత్తితో దాడికి దిగాడు. దీంతో బాధితులు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై 354డీ, 354 ఐపీసీ సెక్షన్లతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ప్రవీణ్, సురేశ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.