Orphan Girls is a Humane Story in Hyderabad : ఒకవైపు తల్లి ఏడాది క్రితమే మరణించింది. ఇప్పుడు తండ్రి తీవ్ర అస్వస్థతకు గురై బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కనీసం బంధువులు అనేవాళ్లు మా వాళ్లే కదా అని జాలి లేకుండా తమకెందుకు అన్నట్లు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో ఆ తల్లిదండ్రుల ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు. ఎవరూ లేనట్లు దిక్కుతోచని విధంగా దీనస్థితిలోకి వెళ్లిపోయారు. తల్లి ఎలాగో చనిపోయింది, ఇప్పుడు తండ్రి పరిస్థితి ఇలా చూసి కుమార్తెలిద్దరూ ఏం చేయాలో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. బాలికల దీన స్థితిని చూసి కొందరు సామాజిక మాధ్యమాల్లో వారి వీడియోలను వైరల్ చేయడంతో బాలల సంరక్షణ అధికారుల దృష్టిలో పడింది. వెంటనే ఆసుపత్రికి వచ్చిన అధికారులు వైద్యులను సంప్రదించి ఆ అమ్మాయిల తండ్రికి వైద్యం అందించాలని కోరారు.
స్థానికులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజిగిరిలోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్న కోటేశ్వరరావు, రేణుకలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి పదో తరగతి చదవగా, చిన్న కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లి రేణుక గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో వారిద్దరి బాధ్యతలను తండ్రినే చూసుకున్నారు. అప్పటివరకు సంతోషంగా గడుపుతున్న వారి జీవితంలోకి ఒక్కసారిగా పెద్ద కుదుపు వచ్చి పడింది. మూడు రోజుల క్రితం తండ్రి అస్వస్థతకు గురైయ్యారు. బాలికలే తన స్నేహితురాలి తల్లిదండ్రుల సహాయంతో మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకర ఆసుపత్రిలో చేర్పించారు. ఇన్సూరెన్స్ ఉందని ఆసుపత్రి యాజమాన్యం రెండు రోజులుగా చికిత్స అందించారు.
తల్లి దూరమవ్వడం తండ్రి ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయి ఉండటంతో బంధువులు ఎవరూ ముందుకు రాలేదని చిన్నారులిద్దరు కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం రాత్రి రోగి బ్రెయిన్ డెడ్ అయ్యారని పరిస్థితి విషమించిందని ఇన్సూరెన్స్ కూడా రావడం లేదని తెలిపారు. డబ్బులు లేవని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరగా వైద్యానికి నిరాకరించడంతో దిక్కుతోచని స్థితిలోకి చిన్నారులు వెళ్లిపోయారు. చిన్నారుల పరిస్థితిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారుల వరకు వెళ్లింది.