Digital Arrest Fraud Threats in AP : సైబర్ నేరస్థులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో తరహాలో ఎత్తులు వేస్తూ ప్రజలను ఏమార్చుతున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల డీపీలను ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ వారు ఇప్పుడు రూట్ మార్చారు. సైబర్ కేటుగాళ్లు డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో బెదిరింపులకు గురిచేస్తూ సరికొత్త పంథాలో దోచుకుంటున్నారు. పొరపాటున చిక్కారా ఖాతాలు ఖాళీ చేసి మాయమవుతారు. తాజాగా ఓ సీఐనే డిజిటల్ అరెస్టుకు యత్నించారు.
‘రెండు రోజుల కిందట ముంబయిలో రోడ్డు ప్రమాదం చేశారు. ఒకరు మరణించారు. మీపై ముంబయి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు’ అని సైబర్ నేరస్థులు ఓ సీఐకి శుక్రవారం ఫోన్ చేశారు. బెదిరించి, ఆపై డిజిటల్ అరెస్టుకు యత్నించారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన ఓ సీఐ వ్యక్తిగత పనుల మీద ముంబయి వెళ్లారు. అక్కడ ఒక హోటల్‌లో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఇచ్చి గదిలో దిగారు. ఐదు రోజులు తర్వాత ఈ నెల 19న గురువారం విమానంలో విజయవాడకు వచ్చేశారు.
Threats From Digital Arrest in Vijayawada : శుక్రవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి సీఐకి ఫోన్ చేశారు. ముంబయి వచ్చారా అని ఆరా తీశారు. అక్కడ ఒక రోడ్డు యాక్సిడెంట్ చేశారని, మీ వల్ల ఒక వ్యక్తి మృతిచెందాడని బెదిరించడం ప్రారంభించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఎన్నో కేసులను డీల్ చేసిన సీఐకే అదే తరహా ఫోన్ రావడంతో కంగుతిన్నారు. ఫోన్ చేసిన వ్యక్తికి తనదైన శైలిలో ప్రశ్నలు వేసి, క్లాస్ తీసుకోవడంతో సైబర్ నేరస్థులు ఫోన్ పెట్టేశారు.
మాస్క్‌డ్ ఆధార్ ఇస్తే మేలని హోటళ్లలో ఇస్తున్న ఆధార్ కార్డు ఇతర వివరాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయనడానికి ఇదే ఒక ఉదాహరణ అని సదరు సీఐ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌డ్ ఆధార్ కార్డు ఇస్తే బాగుంటుందని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఆధార్ కార్డులోని 12 అంకెల స్థానంలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన వాటి స్థానంలో ఎక్స్ గుర్తు ఉంటుంది. ఇలాంటి ఆధార్ కార్డులతో చాలా వరకు మోసాలు నివారించవచ్చని పోలీసులు వివరిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ హోటళ్లలో బ్యాంకింగ్, ఆధార్ నంబర్‌తో సంబంధం లేని సెల్‌ఫోన్ నంబర్ ఇస్తే మేలని పేర్కొంటున్నారు. ఇలాంటి నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
'మేం పోలీసులకు భయపడం - డబ్బులు ఇవ్వం, అరెస్ట్ చేస్తారా చేయండి'