Police Search for Gowtham Reddy : హత్యాయత్నం కేసులో తప్పించుకు పారిపోయిన వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంటిస్థలం కబ్జా కేసులో ఉమామహేశ్వరశాస్త్రిపై హత్యాయత్నం చేయించిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న గౌతంరెడ్డి దేశం విడిచి పారిపోకుండా ఇప్పటికే పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అందుబాటులో ఉన్నా, నాలుగు ప్రత్యేక బృందాలు నిర్విరామంగా గాలిస్తున్నా ఇంతకూ జాడ కనిపెట్టలేకపోయాయి. హత్యాయత్నం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసినప్పటి నుంచి పోలీసులు అన్వేషణ తీవ్రం చేసినా ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. విజయవాడతో పాటు బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారంతో పలు చోట్ల గాలిస్తున్నా ఫలితం లేదు.
ఇటీవల విజయవాడ సత్యనారాయణపురంలోని ఆయన ఇంట్లోనే గౌతంరెడ్డి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్నారన్న సమాచారం మేరకు అక్కడ కూడా ప్రత్యేక బృందం తనిఖీ చేసినా అక్కడ జాడ దొరకలేదు. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయడంతో గౌతంరెడ్డి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అందుకోసం దిల్లీ వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Police Focus on Gowtham Reddy : దీంతో అక్కడ గౌతంరెడ్డి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. న్యాయ సహాయం కోసం ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది. రహస్యంగా ఇతర మార్గాల్లో సన్నిహితులతో సంబంధాలు నెరుపుతున్నారా అన్న కోణంలో క్షుణ్ణంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కుటుంబ సభ్యుల ఫోన్లపైనా నిఘా పెట్టారు. వారికి ఎవరి నుంచి ఫోన్లు వస్తున్నాయి? ఆ నంర్లతో ఎవరు ఎక్కువ సేపు మాట్లాడుతున్నారు? అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు.
స్థలం కబ్జా చేసి - యజమానిని హత్య చేసేందుకు వైఎస్సార్సీపీ నేత సుపారీ
బెజవాడలో భూయజమాని హత్యకు 'సుపారీ గ్యాంగ్' - తెర వెనక వైఎస్సార్సీపీ నేత