Tungabhadra Dam Gate Collapsed :కర్నాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాం 19 వ గేటు కొట్టుకుపోయింది. గత కొద్ది రోజులుగా జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చైన్ లింక్ తెగిపోవటంతో డ్యాం గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ గేట్ నుంచి 40వేల క్యూ సెక్కుల నీరు వృథాగా పోతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నదిలో భారీగా వరద ఉంది. మొత్తంగా లక్ష క్యూసెక్కుల నీరు నదిలో ప్రవహిస్తోందని కర్నూలు - మహబూబ్ నగర్ జిల్లాల్లోని నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
తాత్కాలిక గేటు ఏర్పాటు :తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి పయ్యావుల కేశవ్‌లతో మాట్లాడారు. తాత్కాలిక గేటు ఏర్పాటు చేయటంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను సీఎం ఆదేశించారు. తాత్కాలికంగా స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. టీబీ డ్యాం 1960లో నిర్మించిన పాత డిజైన్ కావడంవల్ల స్టాప్‌లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొందని మంత్రి పయ్యావుల, చంద్రబాబుకు తెలిపారు. అలాగే నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన వెంటనే రాష్ట్రంలోని ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. డ్యామ్ అధికారులతోనూ మాట్లాడినట్లు చెప్పారు. తెల్లవారుజామున గేటు కొట్టుకుపోవడం, ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతుందన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు తుంగభద్ర డ్యామ్ గుండెకాయలాంటిదన్నారు. దీని నమ్ముకుని లక్షలాదిమంది రైతులు పంటలు వేశారని, నీరు వృథాగా పోకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.