TTD Surveillance on Brokers Who Are Involving in Darshan Tickets And Accommodation in Tirumala : శ్రీవారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు దర్శన టికెట్లు, గదులు అధిక ధరలకు విక్రయించే వారిపైన నిఘా పెంచారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే తిరుమల ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీవారి దర్శన టికెట్లు, గదులను అధిక ధరలకు విక్రయించే దళారులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో ఏకంగా ఎమ్మెల్సీ సైతం ఉన్నారు.
తిరుమలలో తిష్ఠవేసిన దళారులపై టీటీడీ విజిలెన్స్, పోలీసుశాఖలు సంయుక్తంగా దృష్టి సారించాయి. సీఆర్వో, జేఈవో కార్యాలయం, ఎంబీసీ 34, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2 వద్ద నిఘా ఉంచి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. వారి నుంచి కూపీలాగి అసలు సూత్రధారులపైనా కేసులు నమోదు చేస్తున్నారు.
ఇటీవలి ఘటనలు పరిశీలిస్తే
- తిరుమల విజిలెన్స్ వింగ్ వీజీవోగా రామ్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం 18 కేసులు దళారులు, ఇతర మోసగాళ్లపై నమోదయ్యాయి. 64 వరకు పిటీషన్లపై చర్యలు తీసుకున్నారు.
- శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లను రూ.65 వేలకు విక్రయించిన ఓ దళారీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆమె పీఏపై తిరుమల వన్‌టౌన్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- పుదుచ్చేరి సీఎం కార్యాలయం నుంచి సిఫారసు లేఖను పొందిన అదే ప్రాంతానికి చెందిన పద్మనాభన్ అధిక ధరలకు విక్రయించగా టీటీడీ విజిలెన్స్ అధికారులు దళారీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
- తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం అతిథిగృహాల్లో లాకర్లు తీసుకునే భక్తులను బురిడీ కొట్టించిన ఆన్‌లైన్ మోసగాడిని అరెస్టు చేశారు.
'దర్శనం, గదుల కోసం ఇతరులను ఆశ్రయించవద్దు. టీటీడీ సేవలపై అవగాహన లేని భక్తులు దళారులను ఆశ్రయిస్తూ మోసాలకు గురవుతున్నారు. భక్తులు అలాంటి వారికి దూరంగా ఉండి శ్రీవారిని దర్శించుకోవాలి. సీఆర్వోలో సంప్రదించాలి. దళారులను గుర్తిస్తే విజిలెన్స్ టోల్‌ఫ్రీ నెంబర్:18004254141, పోలీసు శాఖ, విజిలెన్స్ వింగ్‌కు ఫిర్యాదు చేయవచ్చు.' -రామ్‌కుమార్, వీజీవో, టీటీడీ విజిలెన్స్ వింగ్
విజిలెన్స్ ఫిర్యాదు మేరకు కేసుల నమోదు ఇలా | ||||||
ఏడాది | 2019 | 2020 | 2021 | 2022 | 2023 | 2024 |
కేసులు | 50 | 34 | 46 | 72 | 57 | 38 |
తిరుమలలో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు - చర్యలకు టీటీడీని ఆదేశించిన ప్రభుత్వం