Heavy Rains in Tirumala Today : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో తిరుపతి వీధులన్ని జలమయమయ్యాయి. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్శనానంతరం లడ్డూ విక్రయ కేంద్రాలకు, గదులకు వెళ్లే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ సైతం అప్రమత్తమై పాపవినాశనం, శ్రీవారిపాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేసింది.
ఈ క్రమంలో అధికారులు వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. బాలాజీ కాలనీ నుంచి మహిళా వర్శిటీ మీదుగా వాహనాలను మళ్లించారు. భక్తులను కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా టీటీడీ అధికారులు నిలిపివేశారు. కాగా తిరుపతి లక్ష్మీపురం కూడలిలో, గొల్లవానిగుంట లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం పెరిగింది. గోగర్భం, పాపనినాశనం జలాశయాలు సైతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. భారీ వర్షం వల్ల వెస్ట్ చర్చి కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జి వర్షపు నీటితో నిండిది.