TTD Focus on Tirumala Srivari Seva Tickets :నకిలీ గుర్తింపు కార్డులతో తిరుమల శ్రీవారి సేవా టికెట్లు, వసతి గదులను పొందేందుకు అక్రమార్కులు చేస్తున్న యత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది. ఇందుకోసం ఆధార్‌ను టీటీడీలోని పలు సేవలకు అనుసంధానం చేయనుంది. వివిధ సేవలకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో భక్తులు సమర్పిస్తున్న గుర్తింపు కార్డులు నిజమా కాదా అనేది నిర్ధారించుకునే వ్యవస్థ టీటీడీలో లేకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.
20 లక్షలు చెల్లించాలి : ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్‌లపై టీటీడీ ఈఓ శ్యామలరావు సమీక్షించారు. ఐటీ విభాగంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థతో పాటు ఆధార్ ప్రమాణాల ద్వారా వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. టీటీడీ అధికారులతో యూఐడీఏఐ ప్రతినిధులు సమావేశమై, సేవలకు ఆధార్ అనుసంధానం చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 10 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు
ఆధార్ చట్టం-2016 ప్రకారం సేవలు వినియోగించుకునే ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు రెండు సంవత్సరాలకు రిజిస్ట్రేషన్ రుసుము కింద 20 లక్షలు టీటీడీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ఆధార్ గుర్తింపునకు 40 పైసలు, ఈకేవైసీకి 3 రూపాయల 40పైసలు టీటీడీ కట్టాల్సి ఉంటుంది. ఇటీవలే టీటీడీ పాలకమండలి సైతం ఆధార్ సేవలను వినియోగించుకునేందుకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆధార్ సేవలను టీటీడీ వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.