TTD EO Shyamala Rao At the Dial Your EO Program in Tirupati : వైకుంఠ ఏకాదశికి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమలలో 91 కౌంటర్ల ద్వారా ప్రత్యేక దర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు తెలిపారు. టోకెన్స్ కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు ఈవో స్పష్టం చేశారు. రద్దీ నేపథ్యంలో భక్తులంతా టీటీడీ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య భవనంలో నిర్వహించిన 'డయల్ యువర్ ఈవో కార్యక్రమం' ద్వారా భక్తుల సందేహాలను తెలుసుకుని సమాధానం ఇచ్చారు.
వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు 10 రోజుల పాటు వసతి కల్పించేలా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరగా ఆలయ ఈవో సానుకూలంగా స్పందించారు. అలాగే నడక మార్గంలో దర్శనం టోకెన్లు ఇవ్వాలని భక్తులు అన్నారు. రైల్వే రిజర్వేషన్‌ను 60 రోజులకు తగ్గించిన నేపథ్యంలో ఆర్జిత సేవల బుకింగ్ సైతం రెండు నెలలకు తగ్గించాలని ఓ భక్తురాలు కోరగా దాన్ని పరిశీలిస్తామని ఈవో చెప్పారు.
సరిగ్గా చెక్ చేస్తారు :తిరుమలలో టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని, సన్నిధిలో శ్రీవారి సేవకులు, మహిళా ఉద్యోగులను నియమించాలని కోరగా అలా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు తెలిపారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రత సిబ్బంది లగేజీని సరిగా చెకింగ్ చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ లక్కీడిప్‌లో ఇద్దరికి కాకుండా ముగ్గురికి అవకాశం కల్పించాలని భక్తులు కోరగా అలా చేయడం చాలా కష్టమని స్పష్టం చేశారు.
అలా వీలు కాదు : శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని రాలేనప్పడు, ఆ టికెట్లను అదే నెలలో మరో రోజు అనుమతించాలని ఈవోకి విజ్ఞప్తి చేయగా అన్ని రోజుల్లో అన్ని స్లాట్లు బుక్ అయి ఉంటాయని, అలా మరో రోజు ఇవ్వడానికి వీలు కాదన్నారు.