TTD Complaint to Police on AR Dairy AboutGhee Adulteration Incident :తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. నెయ్యి సరఫరాలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ నిబంధనలను అతిక్రమించిందని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వామి వారి లడ్డూతో పాటు ఇతర ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేయడంలో ఏఆర్ డెయిరీ సంస్ధ నిబంధనలను అతిక్రమించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏఆర్ డెయిరీ సంస్ధ కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ద్వారా టీటీడీని మోసం చేసిందని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ద్వారా ప్రసాదాల తయారీతో దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వివరించారు. మార్చి నెలలో ఈ టెండర్ల ద్వారా నెయ్యి సరఫరా దక్కించుకున్న ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్ధ జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీలలో వరుసగా 4 ట్యాంకర్‌లను సరఫరా చేసిందని తెలిపారు. టెండర్ షరతుల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటించలేదని తెలిపారు. రుచి, వాసన సరిగ్గా లేకపోవడంతో గుజరాత్‌లోని ఎన్డీడీబీ (NDDB), సీఏఎల్ఎఫ్ (CALF) ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహించామని ఫిర్యాదులో తెలిపారు.