Robotic Mule Indian Army : మీరు ఇప్పటి వరకు రెస్టారెంట్లలో సర్వ్ చేసే రోబోలను చూసి ఉంటారు. అలాగే స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పే రోబోల గురించి విని ఉంటారు. రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో రకాల కొత్త రోబోలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు యుద్ధంలో బాంబులు, బుల్లెట్లకు భయపడని రోబోలు కూడా వచ్చేశాయి. అంతే కాదండీ ఇవి గడ్డకట్టేంత చలి ఉన్నా కాస్త కూడా వణకవు. భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాలనీ యుద్ధ స్థావరాలనీ ఈజీగా చేరుకుని శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. ఇండియన్ ఆర్మీలో కొత్తగా చేరిన 'మ్యూల్' రోబో దళం గొప్పతనం గురించే ఇదంతా. ఇంతకీ ఆ రోబోల ప్రత్యేకత ఏంటీ? వాటికంత గుండెధైర్యం ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
మన సైనికులకి సరిహద్దుల్లోని శత్రువులతో యుద్ధం చేయడం ఒకెత్తయితే, భూమికి ఇరవై వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌లాంటి హిమాలయ పర్వతప్రాంతాల్లోని కఠినమైన వాతావరణ పరిస్థితులతో యుద్ధం చేయడం మరొకెత్తు. అంత ఎత్తుకి వెహికిల్స్ కానీ, హెలికాప్టర్లు కానీ చేరుకోలేవు. మరి అంతవరకూ వెళ్లి మన కోసం పోరాడుతున్న సైనికులకి ఆహారమూ, మందులూ, ఆయుధాలూ అందించేదెవరు? ఈ పనులతో పాటూ అవసరమైతే శత్రువులతో యుద్ధం కూడా చేసే ఆధునిక సాంకేతిక సైనిక దళమే 'మ్యూల్'.
![Robotic Mule](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/23507169_army2.jpg)
మ్యూల్ అంటే 'మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్‌మెంట్' ( Multi-Utility Legged Equipment) అని అర్థం. ఇవి చూడ్డానికి 4 కాళ్లతో ఉండి కుక్కలని పోలిన రోబోలు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. మైనస్ 40 డిగ్రీల చలి నుంచి 50 డిగ్రీల ఎండవరకూ ఎలాంటి కఠినమైన వాతావరణాన్నైనా తట్టుకోగలవు. నిటారుగా ఉండే కొండలు, వేగంగా ప్రవహించే సెలయేళ్లూ, అగ్ని ప్రమాదాలూ ఏవీ గమ్యాన్ని చేరుకోకుండా వీటిని అడ్డుకోలేవు. వీటి బరువు సుమారు 50 కేజీలుంటే వీపున మరో 15 కేజీల బరువుండే ఆహారమూ, ఆయుధాలూ, మందులూ వంటివాటిని తీసుకెళ్లి సైనికులకి అందిస్తాయి. దారిలో బాంబులు పేలినా ఏమాత్రం బెదరవు. మందుపాతరలని ముందుగానే పసిగట్టేందుకు వీటి దగ్గర స్పెషల్ సెన్సర్లూ, థర్మల్ కెమెరాలూ ఉన్నాయి. రోజు మొత్తం నిర్విరామంగా పనిచేస్తాయి. పుణెలో ఈ మధ్యే జరిగిన 77వ ఆర్మీ పరేడ్‌లో ఇండియన్ ఆర్మీ ఈ రోబో డాగ్స్‌తో ప్రత్యేక కవాతు చేయించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాతే ఈ మ్యూల్ రోబో ఫోర్స్ గురించి ప్రపంచానికి తెలిసింది. చైనా తర్వాత ఇలాంటి ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్న రోబో ఆర్మీ మనకే ఉందట. దిల్లీకి చెందిన రోబోటిక్స్ సంస్థ ఏరోఆర్క్ వీటిని తయారు చేసింది.
![Donkeys](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/23507169_armyee.jpg)
గాడిదల స్ఫూర్తితోనే!
మ్యూల్ రోబోలు చూడ్డానికి కుక్కల్లా ఉన్నాయి, మరి వీటిని మ్యూల్స్ అని ఎందుకు అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఎక్కడైనా ఇటువంటి రోబోలని 'రోబో డాగ్స్' అనే పిలుస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం మ్యూల్స్ అని పిలవడానికి కారణం కంచర గాడిదలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గుర్రాలకీ, గాడిదలకీ పుట్టిన వాటిని కంచరగాడిదలుగా చెబుతారు. వీటినే ఇంగ్లిష్‌లో మ్యూల్స్ అని పిలుస్తారు. 75 ఏళ్లుగా ఇండియన్ ఆర్మీకి ఇవే ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందిస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణాలలో ప్రత్యేకించి వీటికోసం సైనిక శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.
![Robotic Mule](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/23507169_armye.jpg)
కంచర గాడిదలకు రెండేళ్ల వయసు నుంచే ఇక్కడ- బాంబులకు బెదరకుండా యుద్ధ శిబిరాలకు చేరుకోవడం ఎలానో శిక్షణ ఇస్తారు. అలా ఇవి రెండు ప్రపంచ యుద్ధ సమయాల్లోనే కాదు, కార్గిల్ యుద్ధంలోనూ అనేక సేవలు అందించాయి. పనితీరుని బట్టి అధికారులు వీటికి పేర్లుపెట్టి చోటా, కాలూ, తేజ్, బోలా, గోలూ, దబాంగ్, బందూక్‌సింగ్, శక్తిమాన్, షేక్ చిలీ, మజ్నూ అని పిలుస్తారు. వీటిల్లో 'పెడోంగీ' అనే మ్యూల్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది ఇండియన్ ఆర్మీలో 30 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలు అందించింది. అలా ఒకసారి పాకిస్థాన్ సైనికులకు దొరికిపోయింది. పాకిస్థాన్ సైనికులు దాన్ని ఉపయోగించుకుందామని విలువైన తమ ఆయుధాలని దానిపైన ఉంచి మరొక చోటుకి తీసుకెళ్తున్నప్పుడు ఆయుధాల మూటతో సహా తెలివిగా తప్పించుకుని భారత్ చేరుకుందట. అనంతరం దాని ధైర్యసాహసాలని గుర్తించిన సైనిక అధికారులు దిల్లీలో నీలిరంగు వెల్వెట్ రగ్గుతో సన్మానించారట. అన్నేళ్లు ఆర్మీలో పనిచేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకీ ఎక్కింది. అది మరణించినా 'ఏటీ' (యానిమల్ ట్రాన్స్‌పోర్ట్) విభాగానికి దాని ఫోటోనే మస్కట్‌గా వాడుతున్నారు. ఇలా ఎనలేని సేవలు అందించిన 4000 మ్యూల్స్‌కి రిటైర్మెంట్ ప్రకటించి వాటి స్థానంలో ఈ కొత్త రోబో మ్యూల్స్‌ని తీసుకుంటున్నారు. 'ఎన్నో సందర్భాల్లో కంచర గాడిదలు మా ప్రాణాలు కాపాడాయి వాటిని మరిచిపోవడం అసాధ్యం’ అంటున్నారు సైనికాధికారులు.
అల్యూమినియం పాత్రల్లో వంట ప్రమాదకరమా? - డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!
'యాపిల్ వెనిగర్' ఇంట్లో ఉంటే చాలు! - ఊహించని ప్రయోజనాలు అనేకం