TDP FOCUS ON GUNTUR MAYOR SEAT: గుంటూరు నగర మేయర్ సీటుని కైవసం చేసుకోవటంపై టీడీపీ దృష్టి సారించింది. మార్చి 17వ తేదీతో ప్రస్తుత మేయర్ కావటి మనోహర్ నాయుడు పదవీ కాలం 4 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి సిద్ధమైంది. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 6 స్థానాల్ని కూటమి కైవసం చేసుకుంది. దీంతో మేయర్ సీటు కూడా సులువుగా కూటమికి దక్కే అవకాశాలున్నాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించేందుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం రాత్రి నిర్వహించిని సమావేశంలో మేయర్ సీటు ప్రస్తావన వచ్చింది.
మేయర్ రేసులో కోవెలమూడి రవీంద్ర: స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నట్లుగా మేయర్, రెండు డిప్యూటీ మేయర్ స్థానాల్ని గెలుచుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థిత్వంపైనా పెమ్మసాని ప్రస్తావించారు. ప్రస్తుతం టీడీపీ పక్ష నాయకునిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర మేయర్ అయితే బాగుంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని వెల్లడించారు. అయితే పెమ్మసాని అకస్మాత్తుగా ఈ ప్రస్తావన తీసుకురావటంపై టీడీపీలోని కొందరు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సమావేశం హాలు నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే అధిష్ఠానం ఎవరి పేరుని మేయర్‌గా సూచిస్తే వారికి మద్దతిస్తామని కార్పొరేటర్లు స్పష్టం చేశారు.
స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు కలిపి 31 మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతో మేయర్ సీటుని దక్కించుకోవటం నల్లేరుమీద నడకే అవుతుంది. మేయర్ ఎవరనే విషయంపై రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మాన ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది. మేయర్‌తో పాటు రెండు డిప్యూటీ మేయర్ స్థానాలు కూడా కూటమి కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. వైఎస్సార్సీపీలో గెలిచి డిప్యూటీ మేయర్‌గా ఉన్న సజీల సాధారణ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు.
ఆమెను అలాగే కొనసాగించినా మరో డిప్యూటీ మేయర్ స్థానం ఉంటుంది. అది జనసేనకు దక్కే అవకాశాలున్నాయి. శనివారం నాడు జరిగిన సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా ఉన్నారు. కోవెలమూడి రవీంద్ర సాధారణ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ సీటు ఆశించారు. అయితే సామాజిక సమీకరణల్లో గల్లా మాధవికి సీటు దక్కింది. దీంతో ఆయన మేయర్ పదవి తనకు వస్తుందనే భావనలో ఉన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని సమావేశం తర్వాత కోవెలమూడి అనుచరులు కూడా ఇదే విషయం ప్రచారం చేస్తున్నారు.