Railway Pass Apply Online: దివ్యాంగులు రైల్వేపాసుల కోసం ఇకపై స్టేషన్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రైల్వే పాసు పొందటానికి ఆన్లైన్లో అప్లై చేసుకునేలా రైల్వే శాఖ వెబ్‌సైట్ ప్రారంభించింది. అందులోనే ఈ-టికెట్లు సైతం బుక్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై దివ్యాంగులు తమ ఇంటికి దగ్గరలోని ఇంటర్‌నెట్ సెంటర్ లేదంటే తమ ఇంట్లోని కంప్యూటర్ నుంచి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ఎలా అప్లై చేయాలంటే?: ముందుగా https://divyangjanid.indianrail.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పాసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ అవ్వాలి. కొత్తగా దరఖాస్తు చేయాలంటే న్యూ యూజర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, వివరాలను ఎంటర్ చేయాలి. అనంతరం సైన్ అప్ అవ్వాలి.
ఇందులోనే యూనిక్ డిజబులిటీ ఐడీ కార్డు (UDID) సైతం మంజూరు చేస్తారు. కొత్తగా పాసులు కావలసిన వారు, పాత పాసులను రెన్యువల్ చేయడం కోసం కూడా ఇందులోనే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన వెబ్‌సైట్ అమలులోకి వచ్చింది. దివ్యాంగులు ఓటీపీ ఆధారంగా ఆన్‌లైన్‌లోనే రైల్వే పాసు ఐడీ కార్డును పొందవచ్చు. కొత్తగా అప్లై చేసుకునే సమయంలో మొదట తన పేరు, ఆధార్‌కార్డు నంబరు, ఫోన్ నంబరు ఎంటర్ చేసి, రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత ఫోన్ నెంబరు ఎంటర్ చేసి, తర్వాత సంబంధిత ఫోన్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇలా ఎన్ని సార్లు అయినా లాగిన్ అయి తన దరఖాస్తును చెక్ చేసుకోవచ్చు.
దివ్యాంగుల కష్టాలు తప్పాయి: దివ్యాంగులు రైల్వే పాసు తీసుకోవాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని అనంతపురం దివ్యాంగుల సేవాసమితి అధ్యక్షుడు పీఎండీ షఫీ తెలిపారు. పాసు కోసం గుంతకల్లుకు వెళితే ఇప్పుడే చెప్పలేమంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. గుంతకల్లు డివిజన్ కార్యాలయంలో పడిగాపులు కాసి నిరాశతో వెనుతిరిగి వచ్చే వాళ్లమని అన్నారు. రైల్వే పాసులు పొందటానికి ఆన్‌లైన్‌లోనే పక్రియ మొత్తం రూపొందించడం ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పారు.
రైల్వే ట్రాక్‌ల ఆధునికీకరణ - గంటకు 130 కి.మీ వేగంతో దూసుకుపోనున్న రైళ్లు
గుడ్ న్యూస్ - విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ - కేంద్ర కేబినెట్ ఆమోదం