Thandel Movie Real Story : తండేల్ అంటే సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల నాయకుడు. వారందరినీ ముందుండి నడిపించేవాడు. ఆ పేరుతో వచ్చిన సినిమాకు ప్రేరణ సిక్కోలు వాసి అంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రేక్షకులకు కనిపించే రీల్ హీరో నాగ చైతన్య అయినప్పటికీ రియల్ హీరో జిల్లాకు చెందిన గనగళ్ల రామారావు. ఆయనతో పాటు మరో 21 మంది మత్స్యకారులు పాకిస్థాన్ జైలులో పడిన బాధలు ఆ సమయంలో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు పడిన మనోవేదన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా వెనుకున్న సంగతులు తెలుసుకుందాం.
ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన గనగళ్ల రామారావుతో పాటు 21 మంది మత్స్యకారులు 2018లో గుజరాత్‌లోని వెరావల్ నుంచి సముద్రంపై వేటకు వెళ్లారు. ఆ సమయంలో జీపీఎస్ పని చేయకపోవడంతో పాకిస్థాన్ జలాల పరిధిలోకి దారి తప్పి వెళ్లిపోయారు. 18 నెలల పాటు కరాచీ జైల్లో బందీలుగా ఉన్నారు. ఆ సమయంలో ఇక్కడ వారి కుటుంబీకులు పడిన మనోవేదనను తెరపై చూపించాలనే ఆలోచన రచయిత కార్తీక్ తీడ మదిలో మెదిలింది.
అప్పటికే సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేస్తున్న కార్తీక్, బాధితుల ఇళ్లకు వెళ్లి రెండు సంవత్సరాలు పరిశోధన చేసి కథ సిద్ధం చేశారు. అనంతరం 2023 ఆగస్టులో హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి, చిత్రబృందంలోని పలువురు డి.మత్స్యలేశం గ్రామానికి వచ్చారు. మత్స్యకారులతో మమేకయ్యారు. సముద్రం వాళ్ల వేటకు వెళ్లే విధానాన్ని స్వయంగా బోటు పర్యటించి తెలుసుకున్నారు.
![Thandel True Story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/23506467_thandel-movie-2025.png)
ఇక్కడి మాటలు - వలస జీవుల వెతలు : శ్రీకాకుళం జిల్లాలో సుమారు 190 కిలోమీటర్ల సువిశాల సముద్రం తీరం ఉంది. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు 104 గ్రామాల్లో వేల సంఖ్యలో మత్స్యకార కుటుంబాలున్నాయి. ఇక్కడ జెట్టీలు, సరైన ఉపాధి అవకాశాల్లేకపోవడంతో ఎంతో మంది చెన్నై, గుజరాత్, అండమాన్ వంటి ప్రాంతాలకు అయినోళ్లను వదిలి నెలల తరబడి వలస వెళ్లిపోతుంటారు. ఇంటికి దూరంగా ఉంటూ సముద్రంపై వేట సాగిస్తారు. వారి వెతలు, మత్స్యకార కుటుంబాల దయనీయ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇక్కడి మాటలు, యాస, ప్రాంతాల ప్రస్తావనతో సన్నివేశాలు చిత్రీకరించారు.
కథారచయిత మనోడే : రచయిత కార్తీక్ తీడ స్వగ్రామం ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామం. వీరి కుటుంబం ప్రస్తుతం శ్రీకాకుళం నగరం పీఎన్ కాలనీలో నివాసముంటోంది. తండ్రి వస్త్రవ్యాపారి. ఇక్కడే చదువుకున్నారు. 2012లో ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేసి సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వెళ్లారు. దర్శకుడు కృష్ణవంశీ దగ్గర నక్షత్రం సినిమాకు సహాయ దర్శకుడిగా చేశారు. ఈయన ప్రయత్న ఫలితంగానే తండేల్ కథ సిక్కోలు యాసలోనే వెండి తెరకెక్కింది.
సంతోషంగా ఉంది : నిజ జీవితంలో తమతో పాటు తమ కుటుంబాలు అనుభవించిన వేదనను సినిమాలో చూపించడం చాలా సంతోషంగా ఉందని గగనళ్ల రామారావు తెలిపారు. పాకిస్థాన్‌లో బందీలైనప్పుడు అక్కడ భాష అర్థమయ్యేది కాదని చెప్పారు. ఏం చెయ్యాలో తెలీదని అలాంటి పరిస్థితి నుంచి జిల్లాలో అడుగుపెట్టాక కలిగిన ఆనందం మళ్లీ ఇప్పుడు పొందుతున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రజలు మాటలు, పరిస్థితులు తమ కారణంగా అందరికీ తెలుస్తున్నందుకు ఒకింత గర్వపడుతున్నారని వివరించారు.
![Thandel True Story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/23506467_thandel-movie.png)
అందరి అంగీకారంతోనే సాధ్యమైంది : తాను శ్రీకాకుళం నగరంలోనే పుట్టి పెరిగానని తండేల్ కథారచయిత కార్తీక్ తీడ పేర్కొన్నారు. జిల్లాలోని మత్స్యకారుల కష్టాలను ప్రపంచానికి చూపించాలనే సంకల్పంతో ఈ కథ రాసినట్లు చెప్పారు. బాధితుల ఇళ్లకు వెళ్లి అన్నీ తెలుసుకున్నాక సిక్కోలు యాసలోనే సినిమా తీయాలనిపించిందని వివరించారు. దానికి హీరోతో పాటు దర్శకుడు, నిర్మాత ఇలా అందరూ అంగీకారం తెలపడంతోనే ఇది సాధ్యమైందన్నారు. అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో విజయోత్సవ సభను శ్రీకాకుళంలోనే నిర్వహించాలని చూస్తున్నట్లు కార్తీక్ తీడ వెల్లడించారు.