TTD Compensation Stampede Victims: తిరుపతి తొక్కిసలాట బాధితులకు అన్ని విధాలుగా ఉంటామని హోంమంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు. తొక్కిసలాటలో మృతిచెందిన ఆరుగురిలో నలుగురు విశాఖవాసులే కావడం దురదృష్టకరమన్నారు. టీటీడీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, ఎంఎస్ రాజుతోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బాధిత కుటుంబాలను పరామర్శించారు. విశాఖలోని కంచరపాలెంలో తొక్కిసలాట బాధితురాలు శాంతి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. 27 లక్షల 50 వేల రూపాయల చెక్కును అందించారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఒప్పంద ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
టీటీడీ బోర్డు సభ్యులతో రెండు కమిటీలు: కాగా వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల జారీలో మృతిచెందిన ఆరుగురు కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు టీటీడీ పాలకమండలిలోని బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు శనివారం రాత్రి తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, టీటీడీ అధికారులతో కలిసి గాయపడిన బాధితులకు పరిహారం అందజేశారు.
మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం:తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి 5 లక్షల రూపాయలు, గాయాలైన మరో 5 మందికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులకు చెక్కులను అందజేశామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మృతుల కుటుంబంలో ఒకరికి టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగం, వారి పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు వివరాలు సేకరిస్తామని తెలిపారు.