TTD Board Member MS Raju Sensational Allegations :తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. కావాలనే కొంతమంది అరుపులు సృష్టించి తొక్కిసలాటకు కారణం అయ్యారని తెలుస్తొందన్నారు. అందరి కంటే ముందే వైఎస్సార్పీపీ సోషల్ మీడియాలోకి వీడియోలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేయడం వైఎస్సార్పీపీకి ముందు నుంచి ఉన్న విద్య అన్నారు. తిరుపతి ఘటనపై ఆయన అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తిరుపతి తొక్కిసలాట ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తుందని విమర్శించారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మవద్దని కోరారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. 9 ప్రాంతాల్లో 90 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వైఎస్సార్పీపీ కుట్ర రాజకీయాలను ప్రజలు, భక్తులు నమ్మకూడదని కోరారు. కుట్ర కోణంలో నిజాలు బయటికి వస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు స్పష్టం చేశారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
దుష్ప్రచారాన్ని నమ్మొద్దు : తిరుపతి తొక్కిసలాటలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణాచర్యలకు వెనుకాడేది లేదని TTD బోర్డు సభ్యుడు భానుప్రకాష్ స్పష్టం చేశారు. టోకెన్లు లేని భక్తులకు తిరుమల కొండపైకి ప్రవేశం లేదనే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన కోరారు. పద్మావతి ఆస్పత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించిన ఆయన వారంతా స్వామివారి దర్శనాలు అడుగుతున్నారని తెలిపారు.