ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీటీడీ ప్రక్షాళన సమయం ఇదేనా? మార్పులు చేయాల్సిందేనా! - TTD POLICE MISCOORDINATION

టీటీడీ, పోలీసుల మధ్య సమన్వయలోపమే శాపం - టీటీడీలో భారీ ప్రక్షాళన జరగాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాలు

TTD And Police Miscoordination in Tirupati
TTD And Police Miscoordination in Tirupati (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 9 hours ago

TTD And Police Miscoordination in Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటనపై పోస్టుమార్టం ప్రారంభమైంది. టీటీడీ, పోలీసుల మధ్య సమన్వయలోపమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రద్దీని అంచనా వేయడంలో అధికారులు పూర్తిగా విఫలయ్యారు. నిర్లక్ష్య వైఖరే ఇంతటి దారుణ ఘటనకు దారితీసింది. టీటీడీలో భారీ ప్రక్షాళన జరగాలని, దర్శనం విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనడానికి తాజా ఘటన నిదర్శనం.

వైకుంఠ ఏకాదశికి భక్తులు ఏటా ముందురోజు రాత్రే క్యూలైన్ల వద్దకు చేరుకుంటారు. ఈసారి 50,000 మందికిపైగా భక్తులు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. గురువారం తెల్లవారుజాము నుంచి టోకెన్లు ఇస్తామని టీటీడీ ప్రకటించినా, భక్తులంతా బుధవారం సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున టోకెన్‌ సెంటర్ల వద్దకు చేరుకున్నారు. ఆ విషయాన్ని గమనించినా అధికారులు ఏర్పాట్లు చేయలేదు. సాధారణంగా టోకెన్ల జారీ సమయానికన్నా ముందే భక్తులు అక్కడికి చేరుకున్నా, ఎక్కడికక్కడ బారికేడ్లతో పోలీసులు రద్దీని నియంత్రించేవారు.

ఈసారి ఎప్పుడూ లేనివిధంగా బైరాగిపట్టెడలోని టోకెన్ల జారీ కేంద్రానికి ఆనుకుని ఉన్న శ్రీపద్మావతి పార్కులోకి భక్తుల్ని తరలించి ‘స్టాపర్స్‌’తో దారి మూసేశారు. భక్తులు గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. దీంతో మహిళలు, వృద్ధుల్లో ఓపిక నశించిపోయింది. అనారోగ్యంతో ఉన్న ఒకరి కోసం ‘స్టాపర్లు’ తెరవగా క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నారు అని అనుకుని, టోకెన్ల కోసం భక్తులు నెట్టుకుంటూ ముందుకెళ్లారు. దీంతో తొక్కిసలాట జరిగింది.

తిరుపతి ఘటన - ఇద్దరు అధికారులు సస్పెన్షన్ - ఎస్పీ, జేఈవో బదిలీ​

రద్దీ ప్రదేశాల్లో టోకెన్ కేంద్రాలు: ఘటన జరిగినప్పుడు పార్కులో 2500 మందే ఉన్నట్టు అధికారులు చెబుతున్నా, ఇంకా చాలా మంది ఉన్నట్టు సమాచారం. తిరుపతిలో పలు మైదాన ప్రాంతాలు ఉన్నా వాటిపైన అధికారులు దృష్టిసారించలేదు. గతంలో పెట్టినచోట్ల మళ్లీ టోకెన్‌ కేంద్రాలు పెట్టారు. ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రద్దీ ప్రాంతంలోనే టోకెన్ల జారీతో ట్రాఫిక్ సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఈ అంశాన్ని టీటీడీ అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. బైరాగిపట్టెడలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీ ప్రదేశాల్లో టోకెన్ కేంద్రాల ఏర్పాటు తోపులాటలకు కారణంగా భక్తులు చెబుతున్నారు.

కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించలేదు: టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు ప్రకటించడం ఘటనకు కారణంగా భావిస్తున్నారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనం ఉత్తమోత్తమంగా భావించే భక్తులు టోకెన్లు పొందేందుకు భారీగా తిరుపతికి తరలివచ్చారు. భక్తుల కోసం పకడ్బందీగా క్యూలైను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకుంటూ వచ్చిన అధికారులు అసలు టోకెన్లు జారీ చేసే రోజు మాత్రం పూర్తిగా వదిలేశారన్న విమర్శలున్నాయి. కేవలం క్యూలైన్ల కోసం కంచె వేస్తే తమ పని అయిపోయినట్లుగా అధికారులు భావించారు. భక్తుల సంఖ్యను అంచనా వేసి టోకెన్ల జారీకి సంబంధించి ఎప్పటికప్పుడు తగిన ప్రణాళికలు రచించడంలో టీటీడీ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. తిరుపతి ఈవో శ్యామలరావుతోపాటు జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమీ కనీసం బుధవారం ఘటన జరిగే వరకు ఆయా కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించలేదు. దీనివల్ల ఎంతమంది భక్తులకు కేంద్రాలకు చేరుకున్నారనే అంచనాకు రాలేకపోయారు.

భక్తుల రద్దీ పెరుగుతుంటే ఏం చేస్తున్నారు?- అధికారులపై చంద్రబాబు ఆగ్రహం

అక్కడ అరకొర సిబ్బందే: పోలీస్ అధికారులూ వివరాలను టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురాలేదు. దీంతో రద్దీ పెరగడంతో భక్తులను నియంత్రించలేకపోయారు. టీటీడీ, పోలీస్ అధికారులు ముందుగానే పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు చేపట్టి ఉంటే దుర్ఘటన జరిగేది కాదన్న వాదనలున్నాయి. బుధవారం రాత్రి 10 గంటల తర్వాత రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని పోలీసులు భావించారు. దాంతో అక్కడ అరకొర సిబ్బందే ఉన్నారు. ఘటన జరిగిన పార్కు ముందు 20 అడుగుల దూరంలో బారికేడ్లు ఏర్పాటుచేసి వాటి వెనుక పోలీసులు ఉన్నారు. గేటు తెరిచేటప్పుడూ వీరు ముందుకు రాలేదు. తొక్కిసలాట జరిగాకే స్పందించారు. భక్తులు వేలసంఖ్యలో ఉన్నప్పుడు రోప్‌పార్టీలతో రద్దీని నియంత్రించాల్సి ఉండగా, అలా చేయలేదు. ప్రమాదం జరిగిన సమయంలో అంబులెన్సు అక్కడే ఉన్నా డ్రైవర్‌ మాత్రం లేకపోవడంతో గాయపడ్డవారిని రుయా ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యమైంది. సుమారు 15 నిముషాల వరకు భక్తులు అంబులెన్సు వద్ద వేచి ఉన్నారు.

2014 -19 మధ్య కాలంలో ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచేవారు. దీంతో వైకుంఠ దర్శనాలు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునేవారు. భక్తులను ఆంక్షలు లేకుండా అనుమతించేవారు. టోకెన్ల జారీ వ్యవస్థ లేకపోవడంతో భక్తులను క్యూలైన్లలోకి పంపించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తొలుత కంపార్ట్ మెంట్లలో భక్తులను అనుమతించేవారు. కంపార్ట్ మెంట్ల నిండిపోయిన తర్వాత తిరుమల శ్రీవారి మాడ వీధుల్లో ఉన్న గ్యాలరీలను వినియోగించుకునేవారు. సర్వదర్శనం ప్రారంభమైన వెంటనే కంపార్ట్మెంట్లు ఖాళీ కాగానే గ్యాలరీల్లో ఉన్న భక్తులను అందులోకి తీసుకెళ్లేవారు. దీనివల్ల భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

టీటీడీలో ఈ మార్పులు తీసుకురావాలి: టీటీడీలో సమూల మార్పులు చేపట్టాలి. వీఐపీ సంస్కృతిని తగ్గించాలి. వచ్చిన భక్తులకు తిరుపతిలోనే వసతి కల్పించి, బ్యాచ్‌ల వారీగా కొండపైకి పంపించే విధానం తీసుకురావాలి. శ్రీవారి సర్వదర్శనం స్లాట్లు ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకునే విధానం ఉండాలి. సచివాలయాల్లోనూ శ్రీవారి దర్శనానికి స్లాట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తే తిరుమలలో రద్దీ తగ్గుతుంది. టీటీడీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన సిబ్బందికి స్థానచలనం కల్పించాలి. అయోధ్య, వైష్ణోదేవి లాంటి దేవాలయాలకు టీటీడీ అధికారులను పంపి, అక్కడి విధానాలపై అధ్యయనం చేయించాలి. ఏఐ ద్వారా రద్దీని అంచనావేసే విధానాల్ని వీలైనంత వేగంగా టీటీడీలో ప్రవేశపెట్టాలి.

తిరుపతిలో తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

ABOUT THE AUTHOR

...view details