Sajjanar Clarifies TSRTC New Logo Rumors : తెలంగాణ స్టేట్ (టీఎస్)ను, తెలంగాణ (టీజీ)గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీఎస్‌ఆర్టీసీ పేరు టీజీఎస్‌ఆర్టీసీగా మారింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాల పేర్లనూ మార్చింది. ప్రయాణికులు తమ సూచనలు, ఫిర్యాదులను ఇకపై @tgsrtcmdoffice, @tgsrtchq ఖాతాల ద్వారా అందించాలని కోరింది. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ఈ వివరాలను ప్రకటించారు.
TSRTC Changed As TGSRTC : మరోవైపు ఆర్టీసీ లోగో మారినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. కొత్త లోగో ఇంకా సిద్ధం కాలేదని సజ్జనార్ స్పష్టం చేశారు. తన ఎక్స్ ఖాతాలో ఆర్టీసీ లోగోకు సంబంధించిన విషయంపై వివరణ ఇచ్చారు. నూతన లోగో విషయంలో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదనిపేర్కొన్నారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త చిహ్నాన్ని సంస్థ విడుదల చేయలేదని ఆయన వివరించారు.
యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు : టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న లోగో ఫేక్ అని సజ్జనార్ స్పష్టంచేశారు. దీంతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నూతన లోగోను సంస్థ రూపొందిస్తోందని, యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.