TSPSC Withdraw Petition in Supreme Court on Group1 Exam : రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతంలో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టు(Supreme Court)లో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోనుంది. గతేడాది అక్టోబరులో దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఈ నెల 8న అర్జీ దాఖలు చేసింది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ వేసిన అర్జీ ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సర్వోన్నత న్యాయస్థానం కేసు ఉపసంహరణకు అనుమతి ఇస్తే రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం, నిరుద్యోగులు, గ్రూప్-1 అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త పోస్టులతో కలిపి గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించే యోచనలో టీఎస్పీఎస్సీ(TSPSC) ఉంది. పేపర్ లీక్, బయోమెట్రిక్ నిబంధనలు పాటించనందుకు గతంలో గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అయితే అదే ఏడాది అక్టోబరు 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మళ్లీ రెండోసారి 2023 జూన్ 22న గ్రూప్-1 పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది.
రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్‌ల బదిలీ - టీఎస్పీఎస్సీ నూతన కార్యదర్శిగా నవీన్ నికోలస్
TSPSC Group 1 Cancelled in High Court : ఈ రెండోసారి నిర్వహించిన పరీక్షను దాదాపు 2.33 లక్షల మంది అభ్యర్థులు రాశారు. దీంతో పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు తీర్పును ఇస్తూ గ్రూప్-1 పరీక్షను రద్దు(Group 1 Exam Cancel) చేయాలని, అలాగే మరోసారి నిర్వహించాలని టీఎస్పీఎస్సీకి తెలిపింది. వెంటనే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పబ్లిక్ కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు వెళ్లింది. అయితే డివిజన్ బెంచ్ కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈరెండు తీర్పులు టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా ఉండడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ వేసింది. ఇప్పుడు ఆ అప్పీలు పిటిషన్ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆదివారం విజ్ఞప్తి చేసింది.
Telangana Group 1 Exam : మరోవైపు ప్రభుత్వం కొత్తగా గ్రూప్-1 నోటిఫికేషన్(TSPSC Group1 New Notification) వేస్తామని ప్రకటించి, ఇటీవల మరో 60 ఉద్యోగాలను గుర్తిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే గతంలో ఇచ్చిన 503 పోస్టులను, కొత్తగా చేర్చిన పోస్టులతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ప్రభుత్వం ఆదేశించింది. అయితే 2022లో ఇచ్చిన 503 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొత్తగా గుర్తించిన ఉద్యోగాలను అదనంగా చేర్చడమా లేదా గత నోటిఫికేషన్‌ను రద్దు చేసి అదనపు ఉద్యోగాల పేరుతో మరో నోటిఫికేషన్ ఇవ్వడమా అనే దానిపై టీఎస్పీఎస్సీ చర్చిస్తోంది. వీటితో పాటు పరీక్ష విధానం, సిలబస్‌లోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ వర్గాల సమాచారం. ఈ విషయాలు అన్నింటిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు - త్వరలోనే కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వ సన్నాహాలు ముమ్మరం
టీఎస్పీఎస్సీ గ్రూప్- 2 పరీక్ష వాయిదా