International Drugs Syndicate Busted : తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో ఓ ఫ్లాట్‌పై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 199గ్రాముల కొకైన్‌ను పట్టుకున్నారు. రెండు పాస్‌పోర్టులు, బైకులు, 10 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 35లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
డ్రగ్రాకెట్ కీలక సూత్రధారి గుర్తింపు :నైజీరియా దేశానికి చెందిన డెవిన్ ఎబుకా సూజీ అలియాస్ ఎబుకా అలియాస్ లెబుకా అలియాస్ ఇమ్మాన్యుయేల్ అలియాస్ లెవల్ కీలక సూత్రధారిగా గుర్తించారు. హైదరాబాద్‌కు ఉన్నత విద్య కోసం వచ్చిన ఈయన నగరంలోని టోలిచౌకిలో ఉంటూ స్థానికంగా డ్రగ్స్ విక్రయించేవాడు. ఇతడు ఏడు డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తన నెట్‌వర్క్‌తో డ్రగ్స్ దందాలో ఆరితేరిన డెవిన్ దిల్లీకి మకాం మార్చాడు. ప్రస్తుతం నైజీరియాకు వెళ్లి పెద్ద సిండికేట్ ఏర్పాటు చేసి భారత్ నుంచి వచ్చే ఆర్డర్ ప్రకారం డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.
నైజీరియా మహిళతో డ్రగ్స్ సరఫరా :ఇందుకోసం ప్రత్యేకంగా నైజీరియాకు చెందిన మహిళ ఒనౌహా బ్లెస్సింగ్ అలియాస్ జోవానా గోమెస్ అనే మహిళను నియమించుకున్నాడు. 2018లో భారత్‌కు వచ్చిన ఈమె బెంగళూరులో హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేస్తూ నైజీరియా నుంచి దేశంలోని వివిధ నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తోంది. తన డ్రగ్స్ రవాణాకు ఆటంకం కలగకుండా ఆఫ్రికాలోని మరో దేశమైన గినియా బిస్సో నుంచి నకిలీ పేరుతో పాస్ట్‌పోర్టు తీసుకుంది. ఒకవేళ డ్రగ్స్‌తో పట్టుబడినా కేసుల నుంచి తప్పించుకుని నైజీరియా వెళ్లేందుకు పాస్‌పోర్టు తీసుకుంది.
Accused Brought Drugs To Hyderabad 20 Times : రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తూ డీలర్లకు సరఫరా చేసే నిందితురాలు ఒనౌహా ఇప్పటివరకూ హైదరాబాద్‌కు 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ప్రతిసారీ కనీసం 200నుంచి 300 గ్రాముల చొప్పున కొకైన్ తీసుకొచ్చి హైదరాబాద్‌లోని సప్లయర్లకు విక్రయించేది. ఒక మహిళ తరచూ నైజీరియా- భారత్ మధ్య ప్రయాణించడం గుర్తించిన పోలీసులు ఆమెపై నిఘా ఉంచారు.
ఇదే సమయంలో డెవిన్ ప్రధాన అనుచరుడు లంగర్‌హౌస్‌లో ఉండే నైజీరియాకు చెందిన అజీజ్ నోహిమ్ హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విద్యార్థి వీసాపై నగరానికి వచ్చిన ఇతనిపై ఓయూ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాది బయటకొచ్చాడు.