Penugolu Tribal Walk 18 kilometers for Vote :రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు గిరిజనులు తరలివచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పెనుగోలుకి రహదారులు లేక 18 కిలో మీటర్ల దూరం కాలినడకన గుట్టలు వాగులు దాటుకుంటూ వచ్చి గిరిజనులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా 18 కిలో మీటర్లు గుట్టలు దాటుతూ తమ ఓటు హక్కును వినియోగిస్తున్నా ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్ష కాలంలో అయితే గ్రామంలో నీళ్లు నిలిచిపోతున్నాయని, ఆ సమయంలో చాలా మంది చనిపోయినా ఏ సర్కారు పట్టించుకోలేదని వాపోయారు.
ఇప్పటికైనా తమను ఆదుకుంటారని పెనుగోలు గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప తమ తలరాతలు మారడం లేదని పేర్కొన్నారు. మరోవైపు భద్రాచలం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల నుంచి ఆదివాసీలు భారీ సంఖ్యలో కదిలి వచ్చి క్యూలైన్లలో నిలిచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పోలింగ్‌ను భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ పరిశీలించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో సాయంత్రం 4 గంటలకే అధికారులు పోలింగ్‌ను ముగించారు.