Tribal Student Dies OF Food Poison in Telangana :బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారి విషాహారం వల్ల మృత్యువాత పడింది. బాగా చదువుకొని ఉన్నతస్థాయికి చేరుతుందన్న కన్నవారి ఆశలు ఆవిరయ్యాయి. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో సహచర విద్యార్థులతో భోజనం చేసి శైలజ అనే విద్యార్థిని 21రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. కళ్లముందే కన్నకుమార్తె చనిపోవడంతో ఆ తల్లి పెట్టిన రోదన ఆకాశాన్నంటింది. విద్యార్థిని మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు.
హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ కుమురంభీం జిల్లా వాంకిడి ఆశ్రమపాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో తోటి విద్యార్థులతో భోజనం చేసిన శైలజ అస్వస్థతకు గురైంది. పలువురు చిన్నారులను సమీప ప్రభుత్వాస్పత్రుల్లో చేర్పించి వైద్యం అందించారు. మిగతా వారు కోలుకున్నా శైలజ పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కి తరలించారు. 21రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్సపొందుతూ విద్యార్థిని మృత్యువాత పడింది. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తిచేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తన కుమార్తె పరిస్థితి మరొకరికి కలుగకుండా చూడాలని ఆ తల్లి పెట్టిన కన్నీరు అందరినీ కలిచివేసింది.
చేతులు దులుపుకున్న అధికారులు : బాలికలు అస్వస్థతకు గురై దాదాపు నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ అధికారులు కారణాలను వెల్లడించలేదు. ఘటన జరిగిన మరుసటిరోజు విచారణలో భాగంగా ఆహారపదార్థాల నమూనాలు సేకరించి అన్ని బాగున్నట్లు నివేదిక అందించారు. విద్యార్థినులు ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాల వల్లే అనారోగ్యానికి గురయ్యారంటూ అధికారులు చేతులు దులిపేసుకున్నారనే వాదనలూ వినిపించాయి. ఘటన జరిగిన రోజే విచారణ చేపడితే బాగుండేదని విద్యార్థినుల తల్లిదండ్రులు భావించారు. కలుషితానికి గల కారణాలను అధికారులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెప్పకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.