ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తక్కువ ఖర్చుతో పంచ భూతాత్మక లింగాలు దర్శించుకోండిలా! - PANCHA BHOOTA LINGALA VISIT

తక్కువ ఖర్చుతో శైవ క్షేత్రాల దర్శనం-కార్తిక మాసం స్పెషల్​

train_facility_for_kadapa_district_people_to_visit_pancha_bhoota_lingalu
train_facility_for_kadapa_district_people_to_visit_pancha_bhoota_lingalu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2024, 10:24 AM IST

Train Facility For Kadapa District People to Visit Pancha Bhoota Lingalu :దక్షిణ భారతంలో పంచ భూతాత్మక లింగాలు దర్శనీయ ప్రాంతాలుగా, అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా పేరొందాయి. వీటిలో మనకు సమీపంలోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతోంది. అగ్ని, జల, పృథ్వీ, ఆకాశ లింగాలుగా ఉన్న నాలుగు కోవెలలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. రైలు ప్రయాణం ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఈ క్షేత్రాలన్నింటినీ దర్శించుకునే అవకాశం ఉమ్మడి కడప జిల్లా వాసులకు ఉంది. కార్తిక మాసంలో ఆధ్యాత్మిక, పర్యాటక ఆనందాన్ని పొందాలంటే మీకు వీలైన సమయాల్లో ఆయా క్షేత్రాల దర్శనానికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి మరి. వారాంతపు రైళ్లు కావడంతో రిజర్వేషన్‌ కూడా సులభంగా దొరుకుతుంది.

1. అగ్ని లింగం (అరుణాచలం) :దేశంలో ప్రముఖ శైవక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. తమిళనాడులో ఉంది. అక్కడకు వెళ్లడానికి కడప నుంచి నేరుగా ఓకా-మధురై (రైలు నంబరు 09520) వారంతపు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలులో (నంబరు 09519) కడపకు రావచ్చు. దీంతో పాటు అహ్మదాబాద్‌-తిరుచ్చి (09419), లోకమాన్యతిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ (22101), ముంబయి-కరైకల్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (11017), ముంబయి - నాగర్‌కోయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ వీక్లీ రైలు (16351) కడప నుంచి విల్లుపురానికి వెళతాయి. అక్కడ నుంచి రైలు, బస్సు మార్గాల్లో అరుణాచలం వెళ్లొచ్చు.

2. ఆకాశ లింగం (చిదంబరం) :చిదంబరం నటరాజ స్వామి కోవెలను దర్శించుకునేందుకు కార్తిక మాసంలో భక్తులు పోటెత్తుతారు. ఇక్కడికి వెళ్లడానికి కడప నుంచి అహ్మదాబాద్‌ - తిరుచిరాపల్లి (నంబరు 09419), లోకమాన్యతిలక్‌ - కరైకల్‌ రైలు (నంబరు 11017) నేరుగా చిదంబరం వెళతాయి. అలాగే కడప నుంచి విల్లుపురం వెళ్లి అక్కడి నుంచి బస్సు, రైలు మార్గాల ద్వారా కూడా చిదంబరం చేరుకోవచ్చు. తిరుగు ప్రయాణంలోనూ ఇదే రైళ్లలో అక్కడి నుంచి కడపకు చేరుకోవచ్చు.

కార్తికమాసం స్పెషల్​ - శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

3. జల లింగం (జంబుకేశ్వరం) :తిరుచిరాపల్లికు 11 కి.మీ. దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది. కడప నుంచి తిరుచిరాపల్లికి 22101, 16351, 09419, 09520, 16353 నెంబర్లు గల రైళ్లలో వెళ్లొచ్చు. అటు నుంచి కూడా నేరుగా కడపకు రైళ్లు ఉన్నాయి.

4. పృథ్వీ లింగం (కంచి) :కంచి ఏకాంబరేశ్వర ఆలయాన్ని పృథ్వీ లింగంగా భక్తులు కొలుస్తారు. దేవాలయాల పట్టణంగా పేరొందిన కంచి దక్షిణాదిలో అత్యంత మహిమాన్విత క్షేత్రం. తమిళనాడులోని ఈ ఆలయానికి 22101, 16351 నంబర్లు గల రైళ్ల ద్వారా నేరుగా కడప నుంచి చేరుకోవచ్చు. కార్తిక మాసంలో ఏ రోజు ఈ క్షేత్రాలను దర్శించుకున్నా పుణ్యమేనని పండితులు చెబుతున్నారు.

5. వాయులింగం (శ్రీకాళహస్తి) :పంచభూత లింగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడి శివలింగాన్ని వాయులింగంగా కొలుస్తారు. కడప నుంచి శ్రీకాళహస్తికి నేరుగా తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (17487) వెళుతుంది. అలాగే కడప నుంచి రేణిగుంటకు 17261, 17652, 12794, 12797, 17416 రైళ్లలో వెళ్లి అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా శ్రీకాళహస్తికి చేరుకోవచ్చు. రేణిగుంట రైలు నిలయం నుంచి ఎక్కువ రైళ్లు ఉన్నాయి.

6. ఇతర సదుపాయాలు :పంచభూత లింగాల దర్శనానికి వెళ్లే భక్తులు తమ రిజర్వేషన్‌ టిక్కెట్టు ద్వారా ఆయా రైల్వేస్టేషన్ల డార్మెటరీల్లో వసతిని పొందవచ్చు. వీటితో పాటు తమిళనాడు టూరిజంశాఖ, ప్రైవేటు హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. రూ.700 నుంచి రూ.2,500 వరకు బడ్జెట్‌ హోటళ్లు ఉన్నాయి. ముందుగా ఆయా హోటళ్లలో వసతి గదులను బుక్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది.

7. భక్తులు సద్వినియోగం చేసుకోవాలి :కార్తిక మాసంలో ప్రముఖ శివాలయాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. అరుణాచలం, చిదంబరం, తిరుచినాపల్లి, కంచి, శ్రీకాళహస్తికి వెళ్లి పంచభూత లింగాలను దర్శించుకునేందుకు నేరుగా కొన్ని రైళ్లు అందుబాటులో ఉండగా, మరికొన్ని కనెక్టివిటీ రైళ్లు కూడా ఉన్నాయి. భక్తులు, పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలి.

కార్తికమాసం స్పెషల్ - పంచారామాలకు, శబరిమలకు ప్రత్యేక బస్సులు

ABOUT THE AUTHOR

...view details