Shivaratri Arrangements in Temple : మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. విజయవాడ యనమలకుదురులో రామలింగేశ్వర ఆలయంలో అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని హేమాపురం సిద్దేశ్వరాలయం శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం సిద్ధమవుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు జాతర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కోనసీమ జిల్లా ముక్తేశ్వరం ఆలయంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తొగరపాయ వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా నీటి సౌకర్యం కల్పించారు. శివరాత్రి రోజు రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.
దేశంలో ఉన్న హిందూ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అలా ఎంతో విశిష్టత ఉన్న ఆలయాల్లో ఈ సిద్దేశ్వరాలయం ఒకటి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో నిర్మితమైన హేమావతి సిద్దేశ్వరాలయం అతి ప్రాచీనమైనది. క్రీ.శ. 730లో నొళంబ రాజులు నిర్మించి నట్లు చరిత్ర చెబుతోంది. సాధారణంగా ఏ శివాలయానికి వెళ్లినా లింగాకారంలో పరమశివుడు దర్శన మిస్తాడు.
ఇక్కడ మాత్రం మానవ రూపంలో గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలతో కొలువైన సిద్దేశ్వరుడి జటాజుటాన సూర్య, చంద్రులు కనిపిస్తారు. ఎడమ చేతిలో బ్రహ్మ కపాలాన్ని, కుడి చేతిలో జపమాలను ధరించి అర్ధనిమీలిత నేత్రుడై ఉంటాడు స్వామి. శివుడు విగ్రహ రూపంలో ఆశీన స్థితిలో కొలువై ఉన్న ఆలయం భారతదేశంలోనే ఇదొక్కటేనని చరిత్ర చెబుతోంది. సూర్యాస్తమయ సమయంలో స్వామినుదుటిపై సూర్య కిరణాలు పడి ఆలయంలో వెలుగులు విరాజిల్లడం ఇక్కడి విశేషం. ఇక్కడ శివుడు పీఠంపై సిద్ధాసనంలో కూర్చొని ఉండటంవల్ల సిద్దేశ్వర స్వామి అని పిలువబడుతున్నారు.
కోటప్పకొండలో మహా శివరాత్రి - ప్రభల వేడుకకు సర్వం సిద్ధం
కర్ణాటకలోని నిడిగల్, రొళ్ల మండలం రత్నగిరి సంస్థానాలకు ముఖ్య పట్టణంగా ఉన్న హేమావతిలో వేద విశ్వ విద్యాలయం నెలకొల్పి నట్లు శాసనాలలో ఆధారాలున్నాయి. నొళంబులకు సంతానం లేకపోవడంతో శివుడిని ప్రతిష్ఠించగా ఆడ పిల్ల జన్మించింది. ఆ బిడ్డకు హైమావతి అని పేరు పెట్టగా ఆమె పేరు మీదుగానే ఈ గ్రామాన్ని హేమావతి అని పిలువబడుతోంది. అద్భుతమైన శిల్ప కళ సంపద ఈ శైవ క్షేత్రం సొంతం. ఆలయంలో శివుడికి ఎదురుగా ఉన్న నంది విగ్రహాలు గంభీరంగా లేచి వస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఆలయ పక్కనే కళ్యాణిబావి, నవకోటమ్మ ఆలయాలు ఉన్నాయి. ఈ కళ్యాణి బావిలో స్నానం ఆచరించి సిద్దేశ్వరుడికి పూజలు చేస్తే దీర్ఘకాలిక రోగాలు నయం అవుతాయని బత్తుల నమ్మకం.
ప్రతి ఏటా మహాశివరాత్రిని పురస్కరించుకుని వైభవంగా వారం రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ప్రధానంగా భక్తులు తాము పండించిన పంటలోంచి కొంత భాగాన్ని ఆలయం ముందు ఏర్పాటు చేసే అగ్ని గుండంలో వేస్తారు. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని, ఐశ్వర్యం, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం పనులు చకచక సాగుతున్నాయి.