Traffic Problems due to CM YS Jagan :రాష్ట్రంలో సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా ఆ ప్రాంత ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. 'ఆడుదాం ఆంధ్రా (Adudam Andhra)' ముగింపు వేడుక విశాఖ నగరవాసులుకు తలనొప్పి తెచ్చిపెట్టింది. జగన్ రాక సందర్భంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్ మంగళవారం సాయంత్రం వస్తున్నారనే సమాచారంతో ఉదయం నుంచే వాహనాలను, బస్సు సర్వీసులను నిలిపివేసి జనాలకు చుక్కలు చూపించారు. వందల సంఖ్యలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగర పరిధిలో సిటీ సర్వీసులు తగ్గిపోవడంతో ఆటోల్లోనే నగరవాసులు రాకపోకలు సాగించారు.
Adudam Andhra Final in Visakhapatnam : సీఎం సభ కోసం తీసుకొచ్చిన బస్సులు జాతీయ రహదారిపై పార్కింగ్ చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పీఎంపాలెం స్టేడియం సమీపంలో జాతీయ రహదారిపై రెండువైపులా సుమారు నాలుగు గంటలు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ కష్టాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుపోయినా పోలీసులు ఆ వాహనానికి దారి చూపించే ప్రయత్నం చేయలేదు. జగన్ సాయంత్రం 5 గంటల సమయంలో ఐటీ హిల్స్ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఐటీ సంస్థల నుంచి విధుల ముగించుకుని ఇళ్లకు వెళ్లాల్సిన ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.
సీఎం పర్యటనతో సామాన్యులకు ట్రాఫిక్ కష్టాలు - మీసం మెలేస్తూ హెచ్చరించిన కానిస్టేబుల్
CM YS JaganVisit Visakhapatnam :సీఎం కార్యక్రమం కోసం జనాలను బలవంతంగా తరలించినా స్టేడియంలోకి వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపలేదు. స్డేడియంలోకి వెళితే గేట్లు వేసేస్తారని చాలామంది గ్యాలరీల్లోకి వెళ్లకుండా సీఎం రాకముందే జారుకున్నారు. దీంతో కొన్ని గ్యాలరీలు పలచగా కనిపించాయి. స్టేడియంలోకి వచ్చినవారు వెళ్లిపోవడానికి ప్రయత్నించగా జీవీఎంసీ అధికారులు అడ్డుకున్నారు. మెయిన్‌గేట్ నుంచి వీవీఐపీలను తప్ప వైసీపీలో ముఖ్య నాయకులనూ అనుమతించలేదు. దీంతో కొంతమంది నాయకులు గేటు బయటే ఉండిపోయారు. మరోవైపు సీఎం జగన్ రాకతో పలువురిని పోలీసులు ముందస్తు అరెస్టులు నిర్బంధాలు చేశారు. జనసేన నాయకుడు, కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్‌ను పోలీసులు ఉదయమే అదుపులోకి తీసుకుని ఎంవీపీ స్టేషన్‌కు తరలించారు.