విజయవాడ -హైదరాబాద్ నేషనల్ హైవేపై వాహనాల నిలిపివేత (ETV Bharat) Officials Stop RTC Buses Between AP And Telangana : 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ నగరం చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడికక్కడ నిలిచిన వరదతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలతో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైవేపైకి నీరు చేరింది. వరద ప్రవాహంతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో తెలంగాణ-ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు :విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. ఐతవరం వద్ద నీటి ప్రవాహంతో రహదారులపైకి నీరు చేరుకోవడంతో ఆర్టీసీ బస్సుల నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్‌లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇప్పటికే హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు విజయవాడ బస్టాండ్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు బస్సులు, వాహనాలు సైతం నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దారి మళ్లింపు : విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల దారి మళ్లించారు. విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్‌కు బస్సులు బయలుదేరుతున్నాయి. ఐతవరం వద్ద ఇంకా వరదనీరు ఉండటంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపైకి వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
రికార్ఢు వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలం - Heavy Rains in Krishna District
Traffic Jams Between AP and Telangana :ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ - ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుంచి వరదనీరు దిగువకు భారీగా ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. దీంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. బస్సులోని 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
హైదరాబాద్-విజయవాడ మధ్య రైళ్లు రద్దు- బస్సుల్లో ప్రయాణికులను తరలించేందుకు అధికారుల యత్నం - Trains Cancelled in Rains
క్రేన్ సాయంతో ఒడ్డుకు చేరుస్తున్న పోలీసులు : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని పోలీసులు క్రేన్ సాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు. విజయవాడ నుంచి నందిగామ, నందిగామ నుంచి విజయవాడ వైపు అత్యవసరంగా వెళ్లే వారిని క్రేన్ సాయంతో అటు నంచి ఇటు, ఇటు నుంచి అటు దాటిస్తున్నారు. ప్రజలను క్రేన్ పైకి ఎక్కించి అవతలి ఒడ్డుకు చేరుస్తున్నారు. నందిగామకు చెందిన తనూజ అనే యువతి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆ యువతికి ప్లేట్లెట్లు పడిపోవడంతో అత్యవసరంగా విజయవాడకు వెళ్లాల్సి రావడంతో క్రేన్‌పై ఎక్కించి అవతలి వైపుకు తరలించారు.
నిండుకుండలా ప్రాజెక్టులు- దిగువ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు - HEAVY FLOOD TO PROJECTS IN AP