Threats To Owners Of Liquor Shops in AP :దుకాణం ఇస్తే మాకు ఇవ్వు లేదా 50 శాతం వాటా ఇవ్వు. నువ్వు ఎన్ని డీడీలు (దరఖాస్తులు) కట్టావనేది మాకు అనవసరం. నిర్వహణ మొత్తం మాకే ఇవ్వు. లెక్కలు మేమే తేలుస్తాం! కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గంలో దుకాణాలు దక్కించుకున్న మద్యం వ్యాపారులకు ఓ ప్రజాప్రతినిధి పేరుతో అందిన హెచ్చరిక ఇది.!
"మా పరిధిలో మద్యం దుకాణం పెట్టాలంటే ఫార్మాలిటీస్(మామూళ్లు) పూర్తి చేయాలి. లేకపోతే వ్యాపారం కూడా సాగదు!" మరో నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధే స్వయంగా చేసిన హెచ్చరికలు ఇవి. దీంతో ఆ నియోజకవర్గంలో దుకాణాలు పెట్టేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. పక్క చూపులు చూస్తున్నారు. అక్కడ వసూల్ రాజాగా ముద్ర పడిన ప్రజాప్రతినిధితో తలనొప్పి ఎందుకని ఇతర ప్రాంతాల్లో పెట్టేందుకు దుకాణాల కోసం గాలిస్తున్నారు.
"ఇదేందయ్యా ఇదీ!" ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు - మద్యం టెండర్లలో రింగ్ ?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల దందా ప్రారంభమైంది. దుకాణాల ఏర్పాటు నుంచే బెదిరింపులు మొదలయ్యాయి. మద్యం, ఇసుక వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని స్వయంగా సీఎం చంద్రబాబు తమ్ముళ్లను హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. తమ దోవ తమదే అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో మరీ బరితెగించారు. ముందుగానే దరఖాస్తులు చేయవద్దని హెచ్చరించిన నేతలు తమ వ్యాపారులను సిండికేట్ చేయించి మొత్తం దరఖాస్తులు చేయించారు. వారికి ‘అదృష్టం’ కలిసి రాక లాటరీలో దుకాణాలు రాకపోవడంతో వచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.
50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే ‘అమ్మకాలు ఎలా సాగుతాయో చూస్తామని’ హెచ్చరికలు పంపుతున్నారు. దుకాణంలో వాటాతోపాటు గొలుసు దుకాణాలు సైతం తమవాళ్లకే ఇవ్వాలని షరతులు పెడుతున్నారు. ఈ నెల 14న మద్యం దుకాణాలకు లాటరీల ద్వారా వ్యాపారులను ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లాలో విపరీతమైన పోటీ ఏర్పడింది. కృష్ణా జిల్లా కంటే ఎన్టీఆర్ జిల్లాకు అధిక దరఖాస్తులు అందాయి. అందిన దరఖాస్తులే పోటీ తీవ్రతను వెల్లడించాయి. కృష్ణా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సిండికేట్ ప్రయత్నాలు చాలా వరకు ఫలించడంతో తక్కువ దరఖాస్తులు అందాయి. ఇప్పుడు అదృష్టవంతులను నేతలు వెంటాడుతున్నారు.
దుకాణాల కొనుగోలు...
తెలంగాణ సరిహద్దులో వ్యాపారం జోరుగా ఉంటుందని ఆశించి దరఖాస్తులు చేసిన వ్యాపారులకు చుక్కెదురైంది. తక్కువ ధరలకు మద్యం లభిస్తుందని తెలంగాణకు తరలించవచ్చని ఆశించారు. ఇది నెరవేరకపోవడంతో దుకాణాలను స్థానిక సిండికేట్‌కు విక్రయించారు. రూ.90 లక్షల నుంచి రూ.కోటి వరకు విక్రయించి చేతులు దులుపుకొన్నారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో అయిదు దుకాణాలు విక్రయించారు. నిబంధనల ప్రకారం దుకాణాల అద్దెకు తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని ఎక్సైజ్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
కృష్ణాలో లెక్కే వేరప్పా..!
- కృష్ణా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో 50 శాతం వాటాలకు పట్టుబడుతున్నారు. లేదంటే దుకాణం వదిలేయాలని హెచ్చరిస్తున్నారు.
- పామర్రు పట్టణంలో 4 దుకాణాలకు కేవలం ఒకటే ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజాప్రతినిధి అనుచరులు దాదాపు 20 దరఖాస్తులు చేశారు. కానీ ఒక్కటీ రాలేదు. దీంతో తమకు ఖర్చు అయిందని వాటాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు.
- పామర్రు నియోజకవర్గంలో 16 దుకాణాల్లో ఇంకా పలుచోట్ల ఏర్పాటు చేయలేదు. అడిగిన వాటాలు తేలితేనే అని పట్టుబడుతున్నారు. గొలుసు దుకాణాలు సైతం తమ వారే నిర్వహిస్తారని చెబుతున్నారు.
- ఇక గన్నవరం నియోజకవర్గంలో నేరుగా హెచ్చరికలు చేస్తున్నారు. మొత్తం 23 దుకాణాల్లో 13 దుకాణాలు ప్రజాప్రతినిధి సిండికేట్‌కు దక్కాయి. ముందుగానే దరఖాస్తులు చేయవద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే. మిగిలిన వాటిలో 50 శాతం వాటా కావాలని పట్టుబడుతున్నారు. నగరాన్ని ఆనుకుని ఉన్న రామవరప్పాడు, ప్రసాదంపాడులో ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు.
- గుడివాడ నియోజకవర్గంలో కొన్ని దుకాణాలు వైఎస్సార్సీపీ వ్యాపారుల సిండికేట్‌కు వచ్చాయి. దీంతో అక్కడ ‘రాజీ’ సూత్రం పాటిస్తున్నట్లు తెలిసింది. గుడివాడ పట్టణంలో 7, గ్రామీణంలోని రెండు దుకాణాలకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు 2, విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడి సిండికేట్‌కు 3, స్థానిక నేతల సిండికేట్‌కు 2 దుకాణాలు వచ్చాయి. వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి.
- గుడ్లవల్లేరులోనూ బందరుకు చెందిన ఓ వ్యాపారితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇక్కడ సిండికేట్‌లు తమకు 50 శాతం కావాలని పట్టుబడుతున్నారు.
- పెనమలూరు నియోజకవర్గంలో తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో పంట పండుతోంది. ఇక్కడ నాలుగు దుకాణాలు వచ్చాయి. కానూరు, యనమలకుదురు, తాడిగడప, పోరంకిల్లో ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. జనాభా ఎక్కువ, పక్కనే విజయవాడ నగరం, ఆటోనగర్ ఉండటంతో వ్యాపారం జోరుగా సాగుతుందని అంచనా. ఇక్కడ ప్రజాప్రతినిధి సిండికేట్ చేసి దరఖాస్తులు చేయించారని ప్రచారం ఉంది. విజయవాడ నగరంలో దుకాణాలు ఎక్కువగా తూర్పు పరిధిలో ఏర్పాటు వెనుక ఈ కారణం కూడా ఉంది.
అక్కడ లిక్కర్ లెక్కే వేరు - నూతన మద్యం షాపులకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
మద్యం దుకాణాల కేటాయింపులో సిండికేట్లకు సహకరిస్తే కఠిన చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర