TPCC Chief Mahesh Kumar Goud On BC Survey :బీసీల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. తన కార్యవర్గంలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో కొత్తగా ఎన్నికైన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడారు.
రాహుల్ వదిలిన బీసీ బాణాన్ని :బీఆర్‌ఎస్ బీసీల కులగణన గురించి చేస్తున్న విమర్శలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తిప్పి కొట్టారు. బీసీల గురించి మాట్లాడే హక్కు ఆ రెండు పార్టీలకు(బీఆర్ఎస్, బీజేపీ) లేదని మహేశ్ కుమార్ గౌడ్ ఆక్షేపించారు. తాను రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని అని వెల్లడించారు. ఉత్తర భారత్‌లో అగ్రవర్ణాలకు ధీటుగా కులగణన జరగాలని, దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం జరగాలని 'భారత్ జోడో యాత్ర' నుంచి చాటుతున్న మహానుబావుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. అందుకే ఆయనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను ఒక ధ్యేయంతో పీసీసీ అధ్యక్షుడిగా చేశారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అధిష్ఠానం కోరిన విధంగా ముందుకు పోవాలన్న తపన తనలో ఉందని స్పష్టం చేశారు. పార్టీలో పొన్నం ప్రభాకర్, కేశవరావు, వీహెచ్ లాంటి వారు ఎందరో బీసీల కోసం కొట్లాడుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినా కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తనతో చదివించారని పేర్కొన్న మహేశ్ కుమార్ గౌడ్ అది రేవంత్ రెడ్డి కమిట్మేంట్ అని కొనియాడారు. రేవంత్ రెడ్డి , తాను, పొన్నం ప్రభాకర్ అంతా రాహుల్ గాంధీ సైనికులమేనని వెల్లడించారు.